SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
SP Balu Statue Row | రవీంద్రభారతిలో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటును తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ప్రశ్నించారు.

SP Balasubrahmanyam Statue | హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణకు ముందే వివాదం మొదలైంది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా నటుడు శుభలేఖ సుధాకర్‌తో పాటు కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం నాడు రవీంద్ర భారతిలో విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు.
ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం
లెజెండరీ సింగర్ ఎస్పీ బాలు విగ్రహం రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడంపై వివాదం మొదలైంది. "రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు?" అని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఈ విగ్రహ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే అంశంపై పృథ్వీరాజ్ మాట్లాడుతుండగా.. అక్కడికి చేరుకున్న సినీ నటుడు శుభలేఖ సుధాకర్ ఆయన మాటలను అడ్డుకుని వారించే ప్రయత్నం చేశారు. తనను అడ్డుకోవడానికి మీరు ఎవరు, మీకు ఏం హక్కు ఉందని ఉద్యమకారుడు ప్రశ్నించారు. కెమెరా ఎందుకు లాక్కుంటున్నారు, భావ ప్రకటనా స్వేచ్ఛ అందరికి ఉంటుందని, ఇలా కెమెరాలు లాక్కుని, మాట్లాడకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. శుభలేఖ సుధాకర్ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్రభారతిలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వారి విగ్రహాలు ఎందుకు అని ప్రశ్నిస్తూ.. ఎస్పీ బాలు తెలంగాణ వ్యతిరేకి అని సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు పదేళ్ల కిందట తెలంగాణ గీతాన్ని ఆలపించే గౌరవం ఆయనకు ఇవ్వగా అందుకు ఎస్పీ బాలు నిరాకరించారని పృథ్వీరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిందన్న లైన్లను పాట నుంచి తొలగించాలని, అప్పుడే పాడతానని చెప్పిన బాలు విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం అని పృథ్వీరాజ్ అన్నారు.

తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టండి..
తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ బాలు విగ్రహాన్ని తెలంగాణలో పెట్టాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ఎందరో ప్రముఖులు ఉన్నారని, ముందుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేందుకు నిరాకరించిన వ్యక్తి ఎస్పీ బాలు విగ్రహం ఇక్కడ అవసరం లేదన్నారు. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన పైడి జయరాజ్ జాతీయ స్థాయిలో 8 భాషల్లో సినిమాలు చేశారు. ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణకు సినిమా వాళ్లు వస్తే తన భూములు దానం చేశారని గుర్తుచేశారు.
ఈ గడ్డ మీద పుట్టిన వాళ్లను గౌరవించండి..
జానపద సినిమాలతో ఖ్యాతిగాంచిన కత్తి కాంతారావు, ముచ్చర్ల సత్యనారాయణ, వరంగల్ శంకర్, సారంగపాణి, గద్దర్ లాంటి వారి విగ్రహాలు పెట్టడానికి బదులుగా ఏపీకి చెందిన వారి విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని, దీనిపై పోరాటం చేస్తామని ఉద్యమకారుడు పృథ్వీరాజ్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పైడి జయరాజ్ లాంటి తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెడితే మంచిదన్నారు. ఎస్పీ బాలు లగడిపాటి లాంటి వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందరో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారని, ఈ గడ్డమీద పుట్టిన, ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలు ఆవిష్కరించాలన్నారు. డిసెంబర్ 14న చేయనున్న ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుని తీరాలని ఉద్యమకారుడు పిలుపునిచ్చారు.






















