Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మిర్చిని రూ. 11,781 కనీస ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

Chandrababu: ఏపీలో మర్చిధరలు పడిపోవడంతో రైతుల్ని ఆదుకోవడానికి కేంద్రాన్ని చంద్రబాబు రంగంలోకి దించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం కనీస ధరను రూ. రూ. 11,781 గా నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. క్వింటా మిర్చికి ఈ ధర వర్తిస్తుంది. ధరలు భారీగా పడిపోవడంతో రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. ఇక నుంచి సాగు ఖర్చు.. అమ్మకపు వ్యయం మధ్య వ్యత్యాన్ని కేంద్రం చెల్లిస్తుంది.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం సాయం
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు బాగా పడిపోయినప్పుడు, రాష్ట్రాలు సాయం కోరితే మద్దతు ధర పథకాల పరిధిలోకి రాని వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం సేకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆ నష్టాలను భరిస్తుంది. దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని పేరు పెట్టారు. కేంద్రం గిట్టుబాటు ధర ప్రకటించే వాణిజ్యపంటల జాబితాలో మిర్చి చేర్చకపోవడం వల్ల మిర్చికి ఈ ఫథకాన్ని అమలు చేస్తున్నారు. ఎగుమతులు కేంద్రం చేతిలోనే ఉంటాయి కాబట్టి..ఎగుమతి విధానంపై కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఎగుమతులు తగ్గిపోవడంతో పడిపోయిన ధర
ఏపీలో దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 1.40 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లుగా ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. ఎకరాకు రూ.లక్షన్నర నుంచి రూ.రెండు లక్షలు పెట్టుబడి ఖర్చులవుతాయి. ఓ ఏడాది క్వింటాల్ గరిష్టంగా రూ.26 వేల వరకు వెళ్లడంతో రైతులు ఈసారి కూడా అధిక ధరలు వస్తాయన్న భావనతో భారీగా సాగు చేశారు. 2024 మార్చి తర్వాత ధర రూ.20వేల నుంచి సగానికి పడిపోవడంతో రైతులు మళ్లీ ధరలు పెరుగుతాయనే ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. అప్పటి నుంచి ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడంతో 30 లక్షల బస్తాలకు పైగా స్టోరేజీల్లోనే మిగిలిపోయింది. ఇప్పుడు పదిలక్షల బస్తాల కొత్త పంట కూడా వచ్చి చేరడంతో మొత్తంగా దాదాపు 40 లక్షల బస్తాలు కోల్డ్ స్టోరీజీల్లోనే ఉన్నాయి. ఈ కారణంగా కూడా ధరలు తగ్గుతున్నాయి.
రైతుల కోసం కేంద్రం వద్ద చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు
మిర్చి రైతులకు మేలు చేసేందుకు వారి పంటలకు సరైన ధర ఇప్పించేందుకు చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. తర్వాత రామ్మోహన్ నాయుడు, పెమ్మసానిచంద్రశేఖర్ వంటి వారు కేంద్ర వ్వ్యవసాయశాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపి.. మద్దతు ధరను ప్రకటించేలా చేయగలిగారు. ఈ నిర్ణయంతో ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఎగుమతలపై కేంద్రం విధించిన కొన్ని ఆంక్షలను తొలిగిస్తే డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

