(Source: ECI/ABP News/ABP Majha)
Ratan Tata Death News Live: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
Ratan Tata Death News Live: పారిశ్రామిక దిగ్గజం, భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటా ఇకలేరు. కాలేజీ కుర్రాడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరిలో స్ఫూర్తినింపి తనకంటూ ప్రత్యేక చరిత్ర రాసుకొని వెళ్లిపోయారు.
LIVE
Background
Ratan Tata Death News Live: టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ ఛైర్మన్ ట్విటర్ పోస్ట్ పెట్టి రతన్ టాటా ఇక లేరని తెలిపారు.
రతన్ టాటా వ్యక్తిగతంగా మనతో లేకపోయినా ఆయన వినయం, దాతృత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని టాటా ఫ్యామిలీ తెలిపింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి రతన్ టాటాను స్నేహితుడు, మార్గదర్శిగా అభివర్ణించారు. ఎన్ చంద్రశేఖరన్ ఏమన్నారంటే... “రతన్ టాటాకు చాలా బాధతో వీడ్కోలు పలుకుతున్నాం. ఆయన నిజంగా అసాధారణమైన నాయకుడు, ఆయన పనితీరుతో టాటా గ్రూప్‌ను మాత్రమే కాకుండా దేశాన్ని కూడా తీర్చిదిద్దారు.'' అని రాసుకొచ్చారు.
రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సంతాపం వ్యక్తం చేశారు. దూరదృష్టి గల వ్యాపార నాయకుడని, అసాధారణ మానవుడు అని అభివర్ణించారు. మోదీ ట్విట్టర్‌లో ఇలా రాశారు, "రతన్ టాటా ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, పెద్ద కలలు కనడం, ఇతరులకు తిరిగి ఇవ్వడం. విద్య, వైద్యం, పరిశుభ్రత, జంతు సంక్షేమం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడంలో ముందున్నారని, రతన్ టాటా మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనను దేశానికి గొప్ప బిడ్డగా అభివర్ణించారు.
పారిశ్రామికవేత్త రతన్ టాటా అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
రతన్ టాటా గురించి తెలుసుకోవలసిన విషయాలు:
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ వయసురీత్య వచ్చే వ్యాధితో మూడు రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఒక్కసారిగా బీపీ డౌన్ అవ్వడంతో సోమవారం తెల్లవారుజామున ఆసుపత్రిలో చేరారు.
రతన్ టాటా... భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం రాసుకున్న వ్యక్తి. ఆయన గొప్ప పారిశ్రామికవేత్తగానే కాకుండా దాతృత్వానికి చిరునామాగా కూడా పేరుపొందారు.
1937 డిసెంబర్ 28న బొంబాయిలో (ప్రస్తుతం ముంబై) జన్మించారు. స్వయం కృషితో దేశంలోని అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు పొందారు.
సాల్ట్ నుంచి విమాన సర్వీస్‌ల వరకు అన్నింటిలో టాటాను ఉత్తమంగా నిలిపిన వ్యాపారవేత్త. టాటా సన్స్ ఛైర్మన్‌గా మార్చి 1991 నుంచి డిసెంబర్ 2012 వరకు ఉన్నారు.
టాటా గ్రూప్ ఆదాయాన్ని పెంచడంతో ఆయనకు ఆయనే సాటి. 2011-12లో మొత్తం ఆదాయం $100 బిలియన్లకుపైగా ఉంది.
1962లో టాటా గ్రూప్‌లో చేరారు. వివిధ సంస్థల్లో పనిచేసిన తర్వాత 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
1981లో టాటా గ్రూప్‌లోని ఇతర హోల్డింగ్ కంపెనీ అయిన టాటా ఇండస్ట్రీస్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి టాటాను కొత్త పుంతలు తొక్కించారు.
ఆయన చేసిన సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 2008లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అదే కాదు దేశ విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల ఆయన్ని డాక్టరేట్లతో గౌరవించాయి.
కార్నెల్ విశ్వవిద్యాలయం, సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని బోర్డులో కూడా పని చేశారు.
Ratan Tata: రతన్ టాటాకు కన్నీటి వీడ్కోలు - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
Ratan Tata Final Journey: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. ముంబైలోని వర్లి శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
Ratan Tata: రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభం
Ratan Tata Funeral: దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా అంతిమయాత్ర ప్రారంభమైంది. ముంబయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్ నుంచి వర్లి శ్మశానవాటిక వరకూ అంతిమయాత్ర సాగనుంది. ఆ మహోన్నత వ్యక్తిని కడసారి చూసేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. రతన్ టాటా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది.
Ratan Tata Death News Live: ముంబై వెళ్లి రతన్ టాటాకు నివాళి అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు
Ratan Tata Death News Live: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ ముంబై చేరుకొని రతన్ టాటాకు నివాళి అర్పించారు.
Ratan Tata Death News Live: రతన్ టాటా నిజమైన దేశభక్తుడు: అమిత్ షా
Ratan Tata Death News Live: రతన్ టాటా నిజమైన దేశభక్తుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రతన్ టాటాకు నివాళి అర్పించేందుకు ఢిల్లీ నుంచి ముంబై బయల్దేరిన అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటు అన్నారు. ఆయనతో తనకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు టాటా గ్రూప్ సాధారణ కంపెనీగా ఉన్న టైంలోనే టేకోవర్ చేసి ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దారని అన్నారు. తన ట్రస్ట్ ద్వారా భారతదేశానికి చాలా చేశారని గుర్తు చేశారు. అందుకే ఆయన నిజమైన దేశభక్తుడిగా అభివర్ణించారు. అలాంటి మహనీయుడు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోతూ తన వారసత్వాన్ని విడిచిపెడుతున్నారు అని అన్నారు.
Ratan Tata Death News Live: రతన్ టాటాకు నివాళి అర్పించేందుకు ముంబై వెళ్లనున్న ఏపీ సీఎం, మంత్రులు
Ratan Tata Death News Live: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ మంత్రులతో కలిసి కాసేపట్లో ముంబై వెళ్లనున్నారు. అక్కడ రతన్ టాటాకు నివాళి అర్పించి వస్తారు.