నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా
చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న వెంటనే మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే వాడినని.. చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
అంతకుముందు నటుడు అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. ముందు జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీసుకు, అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. అక్కడికి అప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు అక్కడ బారీకేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటికి రాగానే కుటుంబ సభ్యుల్లో భావోద్వేగం నెలకొంది. కుటుంబ సభ్యులు దిష్టి కూడా తీశారు. జైలు నుంచి విడుదల అయిన అల్లు అర్జున్ ను పలకరించేందుకు సెలబ్రిటీలు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఆయన్ను పరామర్శించి.. చాలా సేపు మాట్లాడారు.