Nara Lokesh: నారా లోకేష్ సూచనలతో ఫీడ్ బ్యాక్ కమిటీ.. ప్రత్యర్థి పార్టీలకు ఛాన్స్ ఇవ్వొద్దని TDP వ్యూహం
TDP Politics | క్షేత్ర స్థాయి పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకు మంత్రి నారా లోకేష్ సూచనలతో టీడీపీ అధినాయకత్వం ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు చేసింది.

అమరావతి: పరిపాలనలోనే కాదు... పార్టీలో సంస్కరణలకు పెద్ద పీట వేస్తోంది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. పార్టీని బలోపేతం చేసే దిశగా ఇప్పటికే వివిధ సంస్కరణలు తెచ్చిన టీడీపీ.. మరో సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తల బలమే పునాదిగా కొనసాగుతున్న టీడీపీ ఇప్పుడు కార్యకర్తల మనోభావాలకు మరింత పెద్ద పీట వేస్తూ మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఫీడ్ బ్యాక్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నేరుగా తెలుసుకునేందుకు కార్యకర్తల నుంచే నేరుగా సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ పని చేయనుంది.
పార్టీ కేడర్ అభిప్రాయాలు అధిష్టానానికి చేర్చనున్న కమిటీ
మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు నేతృత్వంలో త్రిసభ్య కమిటీ కేడర్ ఫీలింగ్స్ లీడర్ కు చేర్చేలా ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ వ్యవహరించనుంది. ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను కొందరు నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. పార్టీని ఓ కుటుంబంగా భావించి కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా టీడీపీ అధినాయకత్వం భావిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలోని వివిధ అంశాలను బహిరంగంగా కాకుండా, పార్టీ దృష్టికి తెచ్చేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆదేశాలతో ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటైంది. దీంట్లో భాగంగా పామర్రుకు చెందిన సోషల్ మీడియాలో యాక్టివుగా ఉండే టీడీపీ కార్యకర్తతో ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ భేటీ అయింది. ఆ కార్యకర్త అభిప్రాయాలను, సలహాలను స్వీకరించింది.
ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఇవ్వకుండా..
టీడీపీ అధిష్టానం దృష్టికి ఏమైనా అంశాలు తెలియచేయాలనుకుంటే ఈ ఫీడ్ బ్యాక్ కమిటీ దృష్టికి తీసుకురావచ్చని కమిటీ సభ్యుడు సత్యనారాయణ రాజు కార్యకర్తలకు సూచించారు. ఈ తరహలో ఫీడ్ బ్యాక్ కమిటీ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని ఫీడ్ బ్యాక్ కమిటీతో భేటీ అయిన కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టింగుల ద్వారా తమ అభిప్రాయాలు తెలియచేస్తే ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.
ఇప్పుడు కార్యకర్తల అభిప్రాయాలను నేరుగా స్వీకరించేలా ఫీడ్ బ్యాక్ కమిటీని ఏర్పాటు చేయడంతో ఆ పరిస్థితి ఇకపై ఉత్పన్నం కాదని సదురు కార్యకర్తలు వివరించారు. అలాగే వివిధ అంశాలపై పార్టీ అధిష్టానానికి ఉండే ఆలోచనలు కూడా తమకు అర్థమవుతున్నాయని కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు.
























