National Education Day : నేటికీ కొనసాగుతున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తి- అమల్లో ఉన్న విద్యా పథకాలు ఇవే
National Education Day : స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యా మంత్రి, విద్యావేత్త అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్థం ఏటా నవంబర్ 11 న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటాం. భారతదేశ భవిష్యత్తు ఎలా ఉండాలో చెప్పే రంగాల్లో విద్య ప్రథమ స్థానంలో ఉంటుంది. విద్య అంటే కేవలం చదువు చెప్పడం కాకుండా నేటి ప్రపంచం ఆశిస్తున్న నైపుణ్యాలు అందివ్వడం కూడా విద్యలో భాగమే. అందులో మన దేశంలో యువత ఎక్కువ ఉన్నందున వారికి నైపుణ్యాభివృద్ధి చేయగలిగితే ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ కాగలదు.
దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు ఉన్న యువతే ఉంది. అందుకే వారికి నాణ్యమైన విద్య, నైపుణ్యాల అభివృద్ధికి అవకాశాలు అందించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే విద్యావ్యవస్థ మారాలి. ఇప్పటికే విద్యావ్యవస్థలో మార్పులు చేర్పులు చేసినప్పటికీ గ్రామీణులకు అవి ఇంకా చేరడం లేదనే విమర్శ ఉంది. అన్ని వర్గాల వారికి, అన్నిప్రాంతాల వారికి విద్యాఫలాలు సమానంగా అందినప్పుడే దేశ భవిష్యత్ మరింత ప్రగతి పథంలో పయనిస్తుంది. భారత ప్రభుత్వం విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని పెంపొందించేందుకు యువతకు శక్తినిచ్చే విద్యా మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొంత వరకు ప్రయత్నం చేస్తోంది.
వివిధ కార్యక్రమాలు, రాజ్యాంగ సవరణల ద్వారా విద్యావ్యాప్తి కోసం గణనీయమైన చర్యలు చేపట్టింది. ఆర్టికల్ 21-A ద్వారా రాజ్యాంగంలోని 86వ సవరణ ద్వారా ఉచిత ప్రాథమిక విద్య అందరికీ అందేలా చర్యలు చేపట్టింది. దీన్ని ప్రాథమిక హక్కుగా చేసి 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అందిస్తోంది. విద్యా హక్కులు (RTE) చట్టం 2009, ఏప్రిల్ 1 2010 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి చిన్నారి కూడా నాణ్యమైన ప్రాథమిక విద్య పొందేలా చేశారు. ఇలా వివిధ చట్టాలు తీసుకురావడమే కాకుండా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అనేక సంస్కరణలు చేశారు. అయితే 20వ దశకంలోకి వచ్చిన తర్వాత వాటి వేగాన్ని పెంచి సమానమైన విద్యా వ్యవస్థ నిర్మించడానికి చర్యలు తీసుకున్నారు.
జాతీయ విద్యా విధానం (NEP 2020): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 జులై 2020న జాతీయ విద్యా విధానం (NEP) 2020కి ఆమోదం తెలిపింది. నేటి ప్రపంచ అవసరాలకు అనుగుణంగా భారతదేశ విద్యా వ్యవస్థను మెరుగుపరిచేందుకు NEP ప్రయత్నిస్తోంది.
PM SHRI: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM SHRI స్కూల్స్ (PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్‌కు 7 సెప్టెంబర్ 2022న ఆమోదం తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020లోని భాగంగా దేశంలోని 14,500 పాఠశాలలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. విద్యార్థుల్లో నాణ్యమైన విద్యాభివృద్ధి, 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం ₹27,360 కోట్లు. ఇది ₹18,128 కోట్ల కేంద్ర వాటాతో ఐదు సంవత్సరాల (2022-2027) పాటు అమలు చేస్తారు.
సమగ్ర శిక్షణ: NEP 2020 సిఫార్సులతో పిల్లలందరికి అహ్లాదకరమైన తరగతి గది వాతావరణంతో నాణ్యమైన విద్యను అందించడం, వారి విభిన్న ఆలోచనలు, అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. 1ఏప్రిల్ , 2021న ప్రారంభించిన ఈ పథకం ఐదేళ్లపాటు కొనసాగుతుంది.
PRERNA: దీన్ని ఓ ప్రయోగాత్మక ప్రాజెక్టుగా 15 జనవరి, 2024 నుంచి ఫిబ్రవరి 17, 2024 వరకు గుజరాత్‌లోని వాద్‌నగర్‌లోని ఓ బడిలో ప్రారంభించారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఎంపిక చేసిన విద్యార్థుల కోసం రూపొందించిందీ ప్రోగ్రామ్. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలతోపాటు స్ఫూర్తిదాయకమైన అభ్యాస అనుభవాన్ని అందించడమే దీని లక్ష్యం. ప్రతి వారం దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు (10 మంది బాలురు మరియు 10 మంది బాలికలు) ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉల్లాస్ : నవ భారత్ సాక్షరత కార్యక్రమం (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం- NILP) అని కూడా పిలుస్తారు. ఉల్లాస్ 2022-2027 మధ్య అమలులో ఉంటుంది. జాతీయ విద్యా విధానం (NEP)కి అనుగుణంగా ఉంటుంది. ఇందులో బడి మధ్యలో మానేసిన 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి విద్యను అందిస్తారు. అక్షరాస్యత పెంచి సమాజంలో వారికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్టార్ట్ చేశారు.
నిపున్ భారత్: నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ రీడింగ్ విత్ అండర్‌స్టాండింగ్ అండ్ న్యూమరాసీ (నిపున్ భారత్)ని 5 జులై 2021న ప్రారంభించింది. దేశంలోని ప్రతి బిడ్డ బేసిక్ విద్య, న్యూమరిక్‌పై పట్టు సాధించడమే దీని లక్ష్యం. మూడో తరగతి పూర్తి అయ్యేలోపు బేసిక్ విషయాలపై పూర్తి అవగాహన కల్పించేందుకు దీన్ని క్రియేట్ చేశారు.
విద్యా ప్రవేశ్: గ్రేడ్-I పిల్లల కోసం మూడు నెలల ఆటలు ఆధారంగా నడిచే ప్లే స్కూల్ లాంటి విద్యను అందివ్వడం దీని ఉద్దేశం. ఇది 29 జూలై 2021న ప్రారంభమైంది. తొలిసారి స్కూల్‌కు వచ్చే పిల్లకు అహ్లాదకరమైన వాతావరణం ఉండేలా, వారికి సానుకూల అభ్యాస అనుభవాన్ని అందివ్వడమే దీని లక్ష్యం.