AP Mega DSC: మెగా డిఎస్సీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
AP DSC Notification | త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటనతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.

Nara Lokesh About AP DSC Notification | అమరావతి: ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తో భారీ ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపి సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు. గత 30 ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వంలో సైతం 2014, 18, 19లలో మూడు డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల విడుదల చేశారు.

నారా లోకేష్ ఇంకా ఏమన్నారంటే..
‘117 జీవో తీసుకొచ్చి గత ప్రభుత్వం నిరుపేద విద్యార్థులను చదువుకు దూరం చేసింది. దాదాపు ఐదేళ్లలో 12 లక్షల మంది స్కూళ్లకు దూరమయ్యారు. స్కూ్ళ్లకు వన్ స్టార్, టూ స్టార్ రేటింగ్ వచ్చిన వాటిపై తమ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసింది. నాడు నేడుతో గత ప్రభుత్వం బిల్డింగులు కట్టినా విద్యార్థులు లేక స్కూళ్లు మూతపడ్డాయి. రంపచోడవరంలో 20 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. కేజీబీవీలో ప్రహరి గోడలు నిర్మాణం చేపడతాం. స్కూళ్లలో సీసీటీవీ, లైటింగ్ ఏర్పాటు చేస్తాం. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు సైతం సీఎస్ఆర్ కింద నిధులు తీసుకొచ్చి తన నియోజకవర్గంలో స్కూళ్లలో వసతలు కల్పిస్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ విద్యార్థుల భవిష్యత్, ప్రభుత్వ పాఠశాలల డెవలప్ మెంట్ ను తమ బాధ్యతగా భావించాలని’ నారా లోకేష్ రాష్ట్ర ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాల చాక్లెట్లు విక్రయాలపై ఉక్కుపాదం మోపుతాం. స్కూల్ ప్రహరి గోడ నుంచి 200 మీటర్ల దూరంలో ఎలాంటి షాపులు లేకుండా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా మత్తు పదార్థాలు, మత్తు చాక్లెట్లు విక్రయించినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.
Also Read: Posani Krishna Murali: నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్, నరసరావుపేట పీఎస్‌లో మరో కేసు నమోదు






















