Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Tirupati Outer Ring Road: ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు వచ్చిపోతుంటాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అయితే దీనికి కొత్త పరిష్కార మార్గంతో వచ్చింది తుడా.

Tirupati Outer Ring Road: తిరుపతి అభివృద్ధికి తగ్గట్టుగానే ట్రాఫిక్ కూడా భారీగా పెరుగుతోంది. స్థానికంగా విస్తరిస్తున్న నగరం, వివిధ ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి వస్తున్న భక్తుల వాహనాలతో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పెడుతోంది. అందుకే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణానికి సిద్ధమవుతోంది తుడా. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించింది.
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ దివాకర్ రెడ్డి అధికారులతో కలిసి తిరుపతిలో పర్యటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిన ప్రాంతాల్లో తిరిగి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. తిరుపతి గ్రామీణ, చంద్రగిరి,రామచంద్రాపురం, రేణిగుంట, వడమాలపేట మండలాల్లో ప్రాంతాలను ఆయన చెక్ చేశారు. దాదాపు 90 కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్డును ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రాంతాల్లో సర్వే కూడా ప్రారంభించారు. 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వైకుంఠ మాల పేరుతో ఈ ఔటర్ రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. అప్పట్లో ఇది ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ దీనిని పక్కన పెట్టేసింది.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరుపతిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. నగరం రూపు రేఖలు మార్చేయాలని చూస్తోంది. అందుకే రోడ్ల అభివృద్ధితోపాటు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతికి భక్తులతోపాటు పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు. వచ్చిన వాళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ట్రాఫిక్‌లో సమయం వృథా కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇది పూర్తి అయితే తిరుపతికి కొత్త కళ వస్తుందని అంటున్నారు. వీలైనంత త్వరగా సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. టెండర్లు పిలవనున్నారు.





















