Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ఇంటికి పిలిచి చంపలేదని తన కుమార్తెను కొడుతుంటే అడ్డం పడి చనిపోయాడని యువతి తల్లి చెబుతోంది.

Hyderabad Crime News: సంగారెడ్డి జిల్లా భీరంగూడలో జరిగిన యువకుడి హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రేమిస్తున్నాడని తెలిసి ఇంటికి పిలిచి హత్య చేశారని ప్రచారం జరుగుతోంది. కానీ యువతి తల్లి చెప్పేది మాత్రం వేరేలా ఉంది. అటు యువకుడి తల్లిదండ్రులు కూడా తమ ఆస్తి కోసమే ఒత్తిడి తెచ్చి చంపేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నటైంలో యువతి తల్లి చెప్పిన విషయాలతో అందరి మైండ్ బ్లాంక్ అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన కాకాణి శ్రవణ్ సాయి బీటెక్ చదువుతున్నాడు. వయసు 19 ఏళ్లు. కుద్బుల్లాపూర్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి బీరంగూడకు చెందిన యువతితో పరిచయం ఉంది. ఇద్దరూ ఒకే చోట చదువుకోవడంతో ఆ స్నేహం ప్రేమగా మారింది. తరచూ ఆమె కోసం బయటకు వెళ్లేవాడు. మంగళవారం కూడా ఆమె పిలిచిందని వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. ఆసుపత్రిలో చేర్చినట్టు స్నేహితులకు, బంధువులకు ఫోన్ వచ్చింది. అంతా వెళ్లే సరికి శివ అని పిలుచుకునే శ్రవణ్‌సాయి చనిపోయి ఉన్నాడు.
శ్రవణ్ సాయిని పిలిచి చంపేశారని బంధువులు ఆరోపిస్తుంటే, అలా చేయలేదని చెబుతున్నారు యువతి తల్లి. ఇద్దరి ప్రేమ గురించి తెలియదని కానీ తన కుమార్తె మాత్రం నాలుగు నెలల గర్భవతి అని సంచలన విషయంలో వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన తర్వాత గట్టిగా నిలదీస్తే సాయి పేరు చెప్పిందని అన్నారు. ఆమె ఆ కుర్రాడిని పిలిచిందని పేర్కొన్నారు. అయితే ఇంట్లో అందరం మాట్లాడుతున్న టైంలో కోపంతో తన కుమార్తెపై చేయి చేసుకున్నానని, దగ్గర్లో ఉన్న బ్యాట్‌తో కొట్టబోయినట్టు పేర్కొన్నారు. ఇంతలో అక్కడే ఉన్న సాయి అడ్డుగా వచ్చాడని చెప్పారు. ఆ దెబ్బ సాయికి తగిలిందని అన్నారు. ఆ దెబ్బకు సాయితోపాటు తన కుమార్తె కిందపడిపోయారని అన్నారు.
ఈ దెబ్బలకు తన కుమార్తెకు చేయి విరిగిందని తెలిపారు. సాయి మాత్రం పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని అన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి బంధువులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పామని అంటున్నారు. కావాలని ఆ అబ్బాయిని కొట్టలేదని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అతన్ని ఇంత వరకు ఎప్పుడూ చూడలేదని ఆ రోజే చూశానని వివరించిందని సమాచారం.
శ్రవణ్ సాయి తల్లిదండ్రులు ఎప్పుడు మరణించారు. అతను పెద్దనాన్న సంరక్షణలో ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే వాళ్లు హైదరాబాద్ వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ప్రేమ గురించి తమకు ఎప్పుడూ చెప్పలేదని అంటున్నారు. తమ బిడ్డను పిలిచి ఆస్తి కోసమే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా వారికి తెలిసే ఇదంతా జరిగిందని ఇప్పుడు మాత్రం తన బిడ్డను కొడితే సాయి అడ్డం వచ్చాడని బుకాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉంటే క్లినిక్‌లో చూపించి పంపించేద్దామని అనుకున్నారని ,కానీ వాళ్లు కాదని చెప్పడంతో తప్పనిసరిగా పెద్దాసుపత్రికి తీసుకురావాల్సి వచ్చిందన్నారు. సాయిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే చనిపోయినట్టు వైద్యులు చెబుతున్నారన అన్నారు. కానీ వచ్చే వరకు ప్రాణాలు ఉన్నాయని చెప్పి తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.





















