Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Malayalam Actor Dileep : నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ఇటీవల నిర్దోషిగా విడుదలైన నటుడు దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ క్యామియో రోల్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Netizens Criticize Mohan lal For Making Cameo Role In Dileep Movie : మలయాళ స్టార్ మోహన్ లాల్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. 2017లో ప్రముఖ నటిపై లైంగిక వేధింపుల కేసులో ఇటీవలే నిర్దోషిగా ప్రకటించిన మలయాళ నటుడు దిలీప్ మూవీలో క్యామియో రోల్ చేయడమే ఇందుకు కారణం.
'భా భా బా'లో క్యామియో రోల్
మలయాళ నటుడు దిలీప్‌ను నిర్దోషిగా ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఆయన రాబోయే చిత్రం 'భా భా బా' ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మలయాళ స్టార్ మోహన్ లాల్ ఓ కీ రోల్‌లో కనిపించారు. కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు ధనుంజయ్ శంకర్ దర్శకత్వం వహించారు.
దిలీప్ ప్రధాన పాత్రలో నటించగా... వినీత్ శ్రీనివాసన్, ధ్యాస్ శ్రీనివాసన్, శాండీ, బాలు వర్గీస్, బైజు సంతోష్, రెడిన్ కింగ్సీ, శరణ్య పొన్వన్నన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు స్టార్ నటులు కలిసి నటిస్తుండడంతో హైప్ క్రియేట్ అవుతోంది. ఈ నెల 18న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ మూవీలో నటించడం ఏంటి?
అయితే, 2017లో నటిపై కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టై, బెయిల్‌పై రిలీజ్ అయిన దిలీప్ మూవీలో మోహన్ లాల్ క్యామియో రోల్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దిలీప్‌కు ఆ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తు చేస్తుండగా... మరికొందరు మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో సన్నిహితంగా ఉంటూ మూవీలో నటించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 'దిలీప్‌తో మాలీవుడ్ స్టార్ అనుబంధం. నాకు మాటలు రావడం లేదు. దిలీప్‌తో అనుబంధం ఉన్న ఎవరినీ గౌరవించవద్దు.' అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే?
మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి 2017, ఫిబ్రవరి 17న కిడ్నాప్‌నకు గురయ్యారు. దుండగులు కారులో ఆమెను కిడ్నాప్ చేసి దాదాపు 2 గంటలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొచ్చిలో ఈ ఘటన జరగ్గా విచారించిన పోలీసులు నటుడు దిలీప్‌తో పాటు 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఆయన్ను ఎనిమిదో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో 4 నెలల తర్వాత దిలీప్ బెయిల్‌పై బయటకు వచ్చారు.
దిలీప్‌పై 120 బి అభియోగాన్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యిందంటూ న్యాయస్థానం దిలీప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఆయన నటించిన మూవీలో మోహన్ లాల్ నటించారనే ఆయన్ను విమర్శిస్తున్నారు.
మరోవైపు, తీర్పు వచ్చిన కొన్ని గంటల తర్వాత కేరళ ప్రభుత్వం బాధితురాలికి సంఘీభావం తెలిపింది. తాము ఇప్పటివరకూ బాధితురాలికి అండగా నిలిచామని... భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం పినరయి విజయన్ తెలిపారు.





















