Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Gautam Gambhir) గత కొద్ది రోజులుగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. టీమ్ లో ప్రయోగాలు చేయడం, సొంత దేశంలోనే టెస్టుల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఓడిపోవడం.. ఇలా పలు విషయాల్లో గంభీర్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు గంభీర్‌పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో టీమ్ ఇండియా ఓటమిపై కోచ్ గంభీర్ బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.
‘గౌతమ్ గంభీర్ వైట్ బాల్ క్రికెట్ వరకు అద్భుతమైన కోచ్. ఈ ఫార్మాట్లో అతడు విజయవంతమయ్యాడు. రంజీ ట్రోఫీలో ఏదైనా టీమ్‌కు కోచ్‌గా మారితే అతడికి మేలు జరుగుతుంది. రెడ్ బాల్ క్రికెట్‌లో ఒక టీమ్ ను ఎలా నిర్మించాలో తెలుస్తుంది. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ క్రికెట్‌లో బలహీనంగా కనిపిస్తోంది. తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ముగ్గురు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ తీసుకుంటే.. మిగతా ప్లేయర్లు సిద్ధం కావడం కాస్త కష్టమే’ అని మాంటీ పనేసర్ అన్నాడు.
అలాగే శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ ‘గిల్‌లో చాలా ప్రతిభ ఉంది. కానీ షాట్ సెలక్షన్ సరిగా లేదు. అయితే విరాట్ కోహ్లీ ( Virat Kohli )బ్యాటింగ్‌లో మాత్రం అన్ని ఫార్మాట్లలోనూ దూకుడు మనకు కనిపిస్తుంది. కానీ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అది లోపిస్తోంది. అలాగే అన్ని ఫార్మాట్లకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించలేడు. అది అతడికి తలకు మించిన భారం’ అని మాంటీ పనేసర్ వెల్లడించాడు.





















