Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Smokers: ఇండియాలో సిగరెట్ ధరలను ఊహించనంతగా పెంచేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఒక్క సిగరెట్ 70రూపాయలు కావొచ్చని అంటున్నారు.

One cigarette to cost Rs 72 soon in India : భారతదేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పన్నుల పెంపుపై తీవ్రంగా ఆలోచిస్తున్న తరుణంలో, సిగరెట్ల ధరలపై సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. త్వరలోనే దేశంలో ఒక్కో సిగరెట్ ధర ఏకంగా రూ. 72 కు చేరుకోవచ్చనే వార్తలు సిగరెట్ అలవాటు ఉన్న వారిలో ఆందోళన కలిగిస్తోంది.
భారత ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో సిగరెట్లపై నేషనల్ కెలామిటీ కాంటింజెంట్ డ్యూటీ (NCCD) , ఇతర పన్నులను పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం, పొగాకు ఉత్పత్తుల ధరలు సామాన్యులకు అందనంత భారంగా ఉంటేనే వినియోగం తగ్గుతుంది. ఈ క్రమంలోనే ఒక్కో సిగరెట్ ధర విదేశీ స్థాయికి చేరే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో ఒక నాణ్యమైన సిగరెట్ ధర సగటున రూ. 15 నుండి రూ. 20 మధ్యలో ఉంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే భారత్‌లో ధరలు ఎక్కువే అయినప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇవి చాలా తక్కువ. పన్నులు పెంచి ఒక్కో సిగరెట్ ధరను రూ. 70 మార్కుకు తీసుకెళ్లడం ద్వారా యువతను ఈ అలవాటుకు దూరం చేయవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తున్నారు.
🚨Cigarette prices likely to increase to 4x.
— DealBee Deals (@DealBeeOfficial) December 29, 2025
Now, this is actually a good move by govt if happen...
After this, the govt should seriously think about:
- Pan masala: 10x price hike
- Alcohol: 4x price hike
Make unhealthy habits harder to afford, not easier... pic.twitter.com/4AlPyhNREg
భారతదేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది పొగాకు సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. సిగరెట్ల ధరలు పెరగడం వల్ల తక్కువ ఆదాయ వర్గాల వారు, విద్యార్థులు ధూమపానానికి దూరమయ్యే అవకాశం ఉంది. అయితే, ధరలు విపరీతంగా పెరిగితే అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. కేవలం ధరలు పెంచడమే కాకుండా, ప్రజల్లో అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని సామాజిక వేత్తలు అంటున్నారు.
నిజానికి ఒక్కో సిగరెట్ ధర రూ. 72 అవుతుందనేది ఒక అంచనా మాత్రమే. ప్రభుత్వం అధికారికంగా పన్నులను ఎంత మేరకు పెంచుతుందనే దానిపైనే తుది ధర ఆధారపడి ఉంటుంది. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో పొగాకు ఉత్పత్తులపై పన్నుల వాత ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
ఇతర దేశాల్లో ఇప్పటికే భారీగా పన్నులు వడ్డిస్తున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో సిగరెట్ అత్యంత ఖరీదైనది. ఆస్ట్రేలియాలో ఒక్కో సిగరెట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 100 నుండి రూ. 120 వరకు ఉంటుంది. అంటే అక్కడ ఒక ప్యాకెట్ ధర దాదాపు రూ. 2,000 పైమాటే. అదేవిధంగా యూకే, ఐర్లాండ్ , కెనడాలో కూడా ధరలు భారత్ కంటే ఐదు నుండి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.





















