Hyderabad Crime News: రాజేంద్రనగర్‌లో విషాదం.. లిఫ్ట్ ఎక్కే ప్రయత్నంలో గుంతలో పడి వృద్ధురాలు మృతి
Hyderabad Crime News: హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసకుంది. డోర్ ఓపెన్ కాగానే లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నించిన వృద్ధురాలు లిఫ్ట్ గుంతలో పడి మృతిచెందారు.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న బండ్లగూడలో ఒక విషాదం చోటుచేసుకుంది. కూతురిని చూసేందుకు వచ్చిన లక్ష్మి అనే వృద్ధురాలు లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నాలుగో అంతస్తులో ఉన్న ఆమె, లిఫ్ట్ వచ్చిందని భావించి గ్రిల్ తలుపులు తెరిచారు. అయితే అప్పటికి లిఫ్ట్ బాక్స్ ఆ అంతస్తుకు చేరుకోకపోవడంతో, ఆమె ఒక్కసారిగా నాలుగో అంతస్తు నుండి నేరుగా లిఫ్ట్ గుంతలోకి పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం సాంకేతిక లోపం కారణంగా ఒకరు ప్రాణం కోల్పోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హైదరాబాద్‌లో గతంలో జరిగిన మరికొన్ని లిఫ్ట్ ప్రమాదాలు
హైదరాబాద్ నగరంలోని అపార్ట్‌మెంట్లలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి:
కాచిగూడలో: కొన్ని నెలల క్రితం కాచిగూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్ల చిన్నారి లిఫ్ట్ గ్రిల్స్ మధ్య తల ఇరుక్కుపోయి మరణించింది. లిఫ్ట్ కదులుతున్న సమయంలో చిన్నారి బయటకు వచ్చే ప్రయత్నం చేయడంతో ఈ దారుణం జరిగింది.
గచ్చిబౌలి ప్రమాదం: గచ్చిబౌలిలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనంలో లిఫ్ట్ వైరు తెగిపోవడంతో అది వేగంగా కిందకు పడిపోయింది. ఈ ఘటనలో లిఫ్ట్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
బంజారాహిల్స్ అపార్ట్‌మెంట్: బంజారాహిల్స్‌లో ఒక అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ కొడుకు లిఫ్ట్ ఆపరేట్ చేస్తుండగా లోపల ఇరుక్కుపోయి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.






















