Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Assembly Election 2026: ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈసీఐ (ECI) రాష్ట్రాల్లో సన్నాహాల చివరి దశను ఇదివరకే పూర్తి చేసింది.

Assembly Election 2026: న్యూఢిల్లీ: నేడు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇందులో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, వివేక్ జోషి వివరాలు వెల్లడిస్తారు.
ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ పర్యటన
గత కొన్ని వారాలుగా ఎన్నికల కమిషన్ బృందం ఈ రాష్ట్రాలన్నింటిలోనూ పర్యటించింది. ఫిబ్రవరిలో అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిలతో పాటు, మార్చి 6- 7 తేదీల్లో కేరళ, మార్చి 9-10 తేదీల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించారు. ఈ పర్యటనల్లో రాజకీయ పార్టీలు, పోలీసులు, అధికారులు, భద్రతా సంస్థలతో సమావేశాలు నిర్వహించారు. హింసను అరికట్టడం, ఓటర్ల జాబితా సవరణ, EVM- VVPATల తనిఖీ, CAPF బలగాల మోహరింపుపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాపై అప్పీల్ చేయడానికి చివరి తేదీ మార్చి 15 కావడం, మిగిలిన రాష్ట్రాల్లో ఈ గడువు అప్పటికే ముగియడంతో ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రాల అసెంబ్లీ గడువు ఎప్పుడు ముగియనుంది..
-
పశ్చిమ బెంగాల్: 7 మే 2026
-
తమిళనాడు: 10 మే 2026
-
అస్సాం: 20 మే 2026
-
కేరళ: 23 మే 2026
-
పుదుచ్చేరి: 15 జూన్ 2026
ఈ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో పరిస్థితి ఏమిటి?
గత ఎన్నికల విషయానికి వస్తే, అస్సాంలో 2021లో మూడు దశల్లో పోలింగ్ జరిగింది. బీజేపీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తమిళనాడులో ఒకే దశలో డీఎంకే (DMK) మెజారిటీ సాధించింది. ఎం.కె. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. టీఎంసీ (TMC) నుండి 215 సీట్లు గెలుచుకుని మమతా బెనర్జీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
కేరళలో కూడా ఒకే దశలో ఎల్‌డిఎఫ్ (LDF) 99 సీట్లు గెలుచుకుంది. పినరయి విజయన్ మళ్లీ సీఎం అయ్యారు.
పుదుచ్చేరిలో ఎన్డీయే (NDA) 16 సీట్లు గెలుచుకుంది. ఎన్. రంగస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.
ఎన్నికలు త్వరగా, అవాంఛిత ఘటనలు జరగకుండా చూడటానికి ఈసీ చర్యలు చేపట్టింది. ఈసారి పశ్చిమ బెంగాల్, అస్సాంలో తక్కువ ఫేజ్‌లలో ఎలక్షన్ జరగవచ్చు. నేడు ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నామినేషన్ తేదీలు, ఓటింగ్ దశలు, కౌంటింగ్ తేదీ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల నియమావళి) సమాచారం అందిస్తుంది. అధికారికంగా ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోష్ పెంచుతాయి. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా, అహింసాయుతంగా ఎన్నికలు నిర్వహించడమే తమ ప్రాధాన్యత అని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ట్రెండింగ్ వార్తలు























