Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
BRSLP: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావుతో పాటు మరో ఇద్దర్ని నియమించారు. మండలిలో ఈ బాధ్యతల్ని ఎల్ రమణకు ఇచ్చారు.

Harish Rao appointed as Deputy Floor Leader in Telangana Assembly: తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అధికార పక్షాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కీలకమైన నాయకత్వ మార్పులు చేపట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నియామకాల్లో అనుభవం, సామాజిక సమీకరణాలు, వాగ్ధాటికి పెద్దపీట వేశారు. హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా నియమించారు.
కేసీఆర్ హాజరు కాకపోయినా గట్టిగా అధికార పక్షాన్ని ఎదుర్కోనున్న హరీష్ రావు
సభా వ్యవహారాలపై లోతైన పట్టు, గణాంకాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేర్పు ఉన్న హరీష్ రావును డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించడం పార్టీకి అతిపెద్ద బలంగా భావిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి సీనియర్ మహిళా నేతగా, మాజీ హోంమంత్రిగా ఆమెకున్న అనుభవం సభలో మహిళా సమస్యలు, పాలనాపరమైన అంశాలపై గళం వినిపించేందుకు తోడ్పడుతుందని బీఆర్ఎస్ బావిస్తోంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ వర్గాల గొంతుకగా, దూకుడున్న నాయకుడిగా సభలో దూకుడైన ప్రతిపక్ష పాత్రను పోషించగలరని కేసీఆర్ భావిస్తున్నారు.
ఎల్ రమణకు మండలిలో బాధ్యతలు.. సుదీర్ఘమైన అనుభవం
శాసనమండలిలోనూ బలమైన నాయకత్వాన్ని కేసీఆర్ సిద్ధం చేశారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన సౌమ్యుడైన నాయకుడు , మాజీ మంత్రి ఎల్ రమణకు మండలిలో ఫ్లోర్ లీడర్ బాధ్యతల్ని కేసీఆర్ ఇచ్చారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయి రాజకీయాలపై పట్టున్న యువ నేత. మండలి విప్‌గా దేశపతి శ్రీనివాస్ నియామకం అత్యంత ఆసక్తికరమైనది. వాగ్ధాటి, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న దేశపతి, ప్రభుత్వంపై సాంస్కృతిక, రాజకీయ విమర్శలు చేయడంలో సిద్ధహస్తులు. విప్‌గా సభ్యులను సమన్వయం చేయడంలో ఆయన పాత్ర కీలకం కానుంది.
అన్ని వర్గాలకూ ప్రాధాన్యం
రెడ్డి, బీసీ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పించడంతో పాటు, మహిళా ప్రాతినిధ్యం కల్పించారు. దీని ద్వారా పార్టీ అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుందనే సంకేతాన్ని కేసీఆర్ ప్రజల్లోకి పంపారు. గతంలో కేవలం కొద్దిమంది నేతలకే పరిమితమైన గళం, ఇప్పుడు ఈ బృందం ద్వారా సభలో నలుమూలల నుంచి వినిపించబోతోందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. ఈ కొత్త టీమ్ ఏర్పాటుతో అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ మరింత పకడ్బందీగా వ్యవహరించనుంది. కేసీఆర్ వ్యూహాల మేరకు, ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే ఈ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల ప్రధాన కర్తవ్యం అని కేసీఆర్ సందేశం పంపించారు.





















