Harish Rao: ఏపీ నల్లమలసాగర్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం - రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదు - హరీష్ రావు ఆరోపణ
Nallamalasagar: ఏపీ నల్లమలసాగర్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Harish Rao on Nallamalasagar: ఏపీ ప్రభుత్వం గతంలో ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం నల్లమల సాగర్ కిందకు మార్చిందని, ఇది కేవలం పేరు మార్పు మాత్రమే తప్ప లక్ష్యం మాత్రం తెలంగాణ నీటిని దొంగిలించడమేనని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో హరీష్ రావు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నల్లమల సాగర్ ప్రాజెక్టుపై, అలాగే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఇది కేవలం నీటి తరలింపు కాదని, తెలంగాణ హక్కులను కాలరాసే జల దోపిడీ అని అభివర్ణించారు.
నల్లమల సాగర్ అక్రమ ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూత్రధారి అయితే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాత్రధారిగా మారి జల ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాలు తమ నీటి వాటా కోసం గట్టిగా పోరాడుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారుగా మాజీ అధికారి ఆదిత్యానాథ్ దాస్ నియామకాన్ని హరీష్ రావు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో ఏపీ సీఎస్‌గా ఉండి, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి వందకు పైగా లేఖలు రాసిన వ్యక్తిని తీసుకొచ్చి సలహాదారుగా పెట్టుకోవడం అంటే దొంగకు తాళాలు ఇచ్చినట్లే అని విమర్శించారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తికి కీలక బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆయన స్పష్టం చేశారు.
బనకచర్ల, నల్లమల సాగర్ వివాదాల పరిష్కారానికి రెండు రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీలు వేయడాన్ని హరీష్ రావు ఒక డ్రామాగా అభివర్ణించారు. ఒకవైపు కోర్టులో కేసు వేస్తూ, మరోవైపు చర్చల కోసం కమిటీలు వేయడం వల్ల కోర్టులో కేసు వీగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొట్టినట్లు ఉండాలి.. దెబ్బ తాకకూడదు అన్న చందంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఏపీ జలదోపిడీ సాగడానికి పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు. గోదావరి - కృష్ణా అనుసంధానం ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 45 టీఎంసీల వాటాను ఏపీ గంపగుత్తగా తరలించుకుపోయే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు వివరించారు. ఈ విషయంలో సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటిస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డికి నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే, అసెంబ్లీలో నల్లమల సాగర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని, ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నాకు రావాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పక్షాన తామే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
బనకచర్ల అయినా..
— BRS Party (@BRSparty) December 30, 2025
నల్లమల్ల సాగర్ అయినా…
జరిగేది తెలంగాణకు జల దోపిడే
బనకచర్లను బంద్ పెడుతున్నామని ఏపీ ప్రకటించగానే
అది తన ప్రతాపం అని డబ్బా కొట్టుకున్నాడు ఈ సీఎం, నీళ్ల మంత్రి.
పోలవరం నుంచి బనకచర్లలో కలపకుండా, పోలవరం–నల్లమల్ల సాగర్‌కు లింక్ చేశారు.
ఎందుకంటే..
గోదావరి నీళ్లను… pic.twitter.com/DkQqk4Cpeu
ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్లు కృష్ణా ద్వారా తరలిస్తే, గోదావరి అవార్డు ప్రకారం, 45:21:14 తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కూడా తెలంగాణకు నీటి వాటా దక్కకుండా ఉండేందుకు కృష్ణాలో కలుపకుండానే, పెన్నా బేసిన్ కు గోదావరి నీటిని తరలించే పెద్ద కుట్రకు తెరతీశారన్నారు. నిజానికి పోలవరం బనకచర్ల విషయంలో కర్ణాటక, మహారాష్ట్రలు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాశాయన్నారు. వరద జలాల మీద కట్టే ప్రాజెక్టు కట్టేందుకు ఏపీకి అవకాశం ఇస్తే అదేవిధంగా ప్రాజెక్టులు కట్టేందుకు డీపీఆర్‌లు పంపుతామని అన్నారని.. గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్లాన్ కర్ణాటక, మహారాష్ట్రకు అర్థం అయ్యింది, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం అర్థం కాలేదన్నారు.





















