Telangana Municipal Elections: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారా.. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా: ఈసీ
Telangana Municipal Elections 2026 | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగారాకు రంగం సిద్ధమైంది. జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితా, 10న తుది జాబితా ప్రచురించాలని ఈసీ ఆదేశించింది.

హైదరాబాద్: తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు వేగవంతం చేశాయి. ఫిబ్రవరి రెండో వారంలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ, మరో 4 మున్సిపాలిటీలు మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆమె ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ఫోటో ఆధారిత ఓటర్ల జాబితాను రూపొందించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా డిసెంబరు 30న పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. అనంతరం జనవరి 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, వారి నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత జనవరి 10న ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని రాణి కుముదిని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది జనవరిలోనే ముగియగా, జీహెచ్‌ఎంసీ గడువు వచ్చే జనవరితో, మరికొన్నింటి గడువు మే నెలతో ముగియనుంది. ఇటీవలే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం తెలిసిందే. తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా అధికారికంగా మోగినట్లయిందని రాజకీయ నేతలు భావిస్తున్నారు. కాగా, ఈ డిసెంబర్ నెలలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశలలో నిర్వహించి, విజేతలను ప్రకటించారు.






















