ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు ఆల్రెడీ గుడ్‌బై చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో ఇరగదీస్తున్నారు. మొన్న ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రోహిత్ అదరగొడితే.. ఈ సారి సఫారీలతో సిరీస్‌లో కోహ్లీ దంచికొట్టాడు. అదే టైంలో రోహిత్ శర్మ.. ప్రపంచ వన్డే క్రికెట్లో అందరికంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా కూడా షహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టి సిక్సర్ల వీరుడిగా రికార్డులకెక్కాడు. రాయ్‌పుర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో అఫ్రిది 351 సిక్సుల రికార్డును దాటిన రోహిత్.. ప్రస్తుతం 355 సిక్సులతో టాప్‌లో ఉన్నాడు.
ఇక రోహిత్ తన రికార్డు బద్దలు కొట్టడంపై రియాక్ట్ అయిన అఫ్రిది.. ‘రికార్డులు బద్దలవ్వడానికే ఉంటాయి. నేను ఇష్టపడే ఆటగాడు నా రికార్డును బద్దలు కొట్టడం ఆనందంగా ఉంది. నా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ 18 సంవత్సరాల తర్వాత బద్దలైంది. ఇది స్పోర్ట్స్‌లో కామన్. నిజానికి IPL 2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడినప్పుడే రోహిత్ శర్మలో ఉన్న క్లాస్‌ను చూశా. అప్పుడే టీమిండియాలో టాప్ ప్లేయర్ అవుతాడని నమ్మకం కలిగింది. ఇప్పుడు రోహిత్ ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా ఎదగడం సంతోషంగా ఉంది.’ అంటూనే రోహిత్, కోహ్లీ ఆటతీరు చూస్తుంటే.. వీళ్లిద్దరూ లేకుండా 2027 వన్డే వరల్డ్ కప్ ఇండియా ఆడకూడదన్నాడు.
అలాగే కోచ్ గంభీర్ కోచింగ్ స్టైల్‌పై స్పందించిన అఫ్రిది.. ‘కోచ్ అయిన మొదట్లో గంభీర్.. తను అనుకున్నదే కరెక్ట్ అని అనుకున్నట్లు అనిపించింది. కానీ ప్రతి సారీ మనమే కరెక్ట్ అనే ఆలోచన చాలా తప్పు. అది ఇప్పుడు గంభీర్ తెలుసుకున్నట్లున్నాడు.’ అంటూ చురకలు వేశాడు. అంటే ఒకపక్క రోకోని ప్రశంసిస్తూనే గంభీర్‌కి చురకలంటించాడన్నమాట.





















