Who Is Satyanarayana Raju: ఐపీఎల్‌లో బోణీ చేసిన సత్యనారాయణ రాజు- మొదటి వికెట్ తీసుకున్న కాకినాడ కుర్రోడు
Who Is Satyanarayana Raju:ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడుతున్న కాకినాడ కుర్రోడు సత్య నారాయణ రాజు తొొలి వికెట్ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై మూడు ఓవర్లు వేసి రషీద్ ఖాన్ వికెట్ తీసుకున్నాడు.

Who Is Satyanarayana Raju: ఐపీఎల్ వల్ల ఎంతోమంది యంగ్ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. వాళ్లలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, సిరాజ్ లాంటి వాళ్ళ ప్రతిభ మరింత రాటు తేలింది ఐపీఎల్ వల్లే. అంబటి రాయుడు లాంటి వాళ్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ఇప్పుడు అదే కోవలో మరో తెలుగు కుర్రోడు ముంబై ఇండియన్స్ తరఫున IPL 2025 లో తొలిసారి అడుగు పెట్టడమే కాకుండా వరుసగా ప్లేయింగ్ 11 లో రెండో మ్యాచ్‌లో చోటుదక్కించుకుంటున్నాడు.
తొలి మ్యాచ్ సీఎస్‌కేపై సత్యనారాయణ రాజు ఆడాడు. వేసింది ఒకే ఓవర్ అయినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మరో ఓవర్ ఇచ్చేందుకు కెప్టెన‌్ ధైర్యం చేయలేదు. అక్కడ రెండో ఓవర్ ఇవ్వకపోయినప్పటికీ రెండో మ్యాచ్‌లో మాత్రం ఛాన్స్ ఇచ్చారు. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫుల్ స్పెల్ బౌలింగ్ వేశాడు. ఈ స్పెల్‌లో సత్యనారాయణ రాజు తన తొలి వికెట్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో రషీద్ ఖాన్ వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కూాడా రాజు గట్టిగానే పరుగులు ఇచ్చాడు. మూడు ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లో కూడా ఒక ఓవర్ వేసి13 పరుగులు ఇచ్చాడు.
ఎవరీ సత్యనారాయణ రాజు ?
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు 2024 లో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో అదరగొట్టాడు. ఏడు మ్యాచుల్లో ఎనిమిది ముఖ్యమైన వికెట్లు తీసాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆంధ్ర టీమ్ తరపున 7 వికెట్లు రంజీ ట్రోఫీలో ఆరు మ్యాచుల్లో 17 వికెట్లు తీసి ప్రతిభ చాటాడు. దానితో ముంబై ఇండియన్స్ 30 లక్షల బేస్ ప్రైస్‌కు సత్యనారాయణ రాజును కొనుగోలు చేసింది. ఆల్ రౌండర్ క్యాటగిరీలో ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కించుకున్న 25 ఏళ్ల రాజు గత ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తో IPL లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో ఒక ఓవర్ వేసి 13 పరుగులు ఇచ్చిన రాజు ఒక క్యాచ్ కూడా తీసుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్లో రెండోసారి ప్లేయింగ్ 11 ఆడిన సత్యనారాయణ రాజు కు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ కూడా ముంబై ఇండియన్స్ లోనే ప్రస్తుతం ఉన్నాడు. అలాగే ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ లాంటి సీనియర్ బౌలర్లతో పాటు రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ల సాహచర్యం కూడా తన టాలెంట్ ని మెరుగుపరచుకోవడానికి సత్యనారాయణ రాజుకి ఉపయోగపడుతుందని కాకినాడలోని అతని సహచరులు, ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ నగరంలోనే నివసిస్తున్న సత్యనారాయణ రాజు తల్లిదండ్రులు రమేష్, రాఖీలు తమ కుమారుడు క్రికెట్ లో చాలా అగ్రస్థానానికి చేరుతాడు అంటూ నమ్మకంతో ఉన్నారు.
IPL 2025 లో ఐదుగురు తెలుగు క్రికెటర్లు
ఈ ఏడాది ఐపిఎల్ లో ఐదుగురు తెలుగు క్రికెటర్లాడుతున్నారు. కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ను ముంబై ఇండియన్స్ 30 లక్షలకు కొనుగోలు చేయగా, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్ 12.25 కోట్లకు, గుంటూరుకు చెందిన షేక్ రషీద్ ను చెన్నై సూపర్ కింగ్స్ 30 లక్షలకు, శ్రీకాకుళం కు చెందిన త్రిపురణ విజయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 30 లక్షలకు, వైజాగ్ కు చెందిన పైల అవినాష్ ను పంజాబ్ కింగ్స్ 30 లక్షలకు కొనుగోలు చేసాయి. IPL 2025 లో వేలం కోసం 18 మంది తెలుగు క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా ఈ ఐదుగురి నే ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.




















