Vajpayee statue in Amaravati: వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం - విగ్రహావిష్కరణలో చంద్రబాబు, చౌహాన్ సంకల్పం
Vajpayee statue: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు, శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోందన్నారు.

Vajpayee statue unveil in Amaravati: అమరావతిలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా అమరావతిలోని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వాజ్‌పేయీ 13 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఒక మహోన్నత నాయకుడి విగ్రహం రాజధాని ప్రాంతంలో కొలువుదీరడం చారిత్రక ఘట్టమని నేతలు అభివర్ణించారు.
వాజ్‌పేయి స్ఫూర్తితో ఆధునిక భారతాన్ని నిర్మిస్తున్న మోదీ : చంద్రబాబు
విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాజ్‌పేయీతో తనకున్న విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దేశంలో మౌలిక సదుపాయాల విప్లవానికి వాజ్‌పేయీనే ఆద్యుడని, ఆయన ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు వల్లనే నేడు జాతీయ రహదారులు ఇంతగా అభివృద్ధి చెందాయని కొనియాడారు. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి అటల్ జీ అని, ఆయన బాటలోనే నేడు ప్రధాని మోదీ ఆధునిక భారతదేశాన్ని నిర్మిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిలో కూడా వాజ్‌పేయీ స్ఫూర్తి నిరంతరం ఉంటుందని ఆయన ఆకాంక్షించారు.
రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో కార్యక్రమంలో గౌరవ ముఖ్యమత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తో బాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అనంతరం సభను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.… pic.twitter.com/3zEPDnO3SJ
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 25, 2025
వాజ్‌పేయి గొప్ప తత్వవేత్త: శివరాజ్ సింగ్ చౌహాన్
వాజ్‌పేయీ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, కోట్ల మందికి స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప తత్వవేత్త అని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు మేలు చేసేందుకు ఆయన ప్రవేశపెట్టిన 'ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన' పథకం నేటికీ పల్లెల ప్రగతికి బాటలు వేస్తోందని గుర్తుచేశారు. అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అటల్ జీ వేసిన అడుగుజాడల్లోనే ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరియు అమరావతి మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఆనందదాయకమని ఆయన వ్యాఖ్యానించారు.
వాజ్ పేయి స్మృతి వనం శాశ్వత నిర్మాణం
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, బీజేపీ రాష్ట్ర నేతలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాజ్‌పేయీ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ప్రాంగణం సందర్శకులకు ఆయన జీవిత చరిత్రను, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసేలా ఉంది. 2027 నాటికి అమరావతిలో ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న తరుణంలో, ఈ విగ్రహావిష్కరణ రాజధాని నిర్మాణంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపింది. వాజ్ పేయి శాశ్వత స్మృతి వనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.





















