AP High Court Construction: ఏపీ హైకోర్టు భవన నిర్మాణంలో కీలక ఘట్టం - రాఫ్ట్ ఫౌండేషన్ ప్రక్రియ ప్రారంభం - ఇదేమిటో తెలుసా ?
Raft foundation: ఏపీ హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం ప్రారంభమయింది. భారీ మొత్తం సిమెంట్ కాంక్రీట్ ను రాఫ్ట్ ఫౌండేషన్‌కు వాడనున్నారు.

AP High Court Iconic building Construction: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించి అత్యంత కీలకమైన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన ఈ పనులకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు మళ్లీ రెట్టింపు వేగంతో రాజధానిని నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు.
నార్మన్ ఫోస్టర్స్ డిజైన్‌తో ఏపీ హైకోర్టు భవన నిర్మాణం
ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. మొత్తం బేస్‌మెంట్, గ్రౌండ్ , 7 అంతస్తుల విధానంలో ఐకానిక్ భవనంగా దీనిని నిర్మిస్తున్నారు. సుమారు 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో , 52 కోర్టు హాల్స్‌తో ఈ భవనం నిర్మితమవుతోంది. 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉండగా, 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ భవనం కోసం దాదాపు *45,000 టన్నుల స్టీల్‌ను వినియోగిస్తుండటం విశేషం.
పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేయడమే రాఫ్ట్ ఫౌండేషన్
ఈ భవన నిర్మాణంలో రాఫ్ట్ ఫౌండేషన్ అనేది అత్యంత కీలకం. సాధారణంగా చిన్న భవనాలకు విడివిడిగా పిల్లర్లు వేస్తారు. కానీ, హైకోర్టు వంటి భారీ భవనాలు, ఐకానిక్ స్ట్రక్చర్స్ నిర్మించేటప్పుడు భవనం మొత్తం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే 'రాఫ్ట్' లేదా 'మ్యాట్' ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం బరువు విపరీతంగా ఉన్నప్పుడు, భవనం కుంగిపోకుండా ఉండటానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది భవనానికి అపారమైన స్థిరత్వాన్ని , పటుత్వాన్ని ఇస్తుంది.
2027 చివరికి హైకోర్టు భవన నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం
రాజధానిలో నిర్మిస్తున్న 7 ఐకానిక్ భవనాల్లో హైకోర్టు ఒకటి. దీనిని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడంతో వ్యయం పెరిగిందని, అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం కావడంతో, ఇకపై భవనం పనులు వేగంగా జరుగుతాయని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.





















