Telangana Congress: కేబినెట్ విస్తరణ సమాచారం కోసం కాంగ్రెస్ నేతల ఎదురుచూపులు - ఉగాది రోజు ఉంటుందా ?
Telangana: మంత్రి వర్గ విస్తరణ సమాచారం కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు. హైకమాండ్ లెటర్ పంపుతుందా.. ఉగాది రోజుల ప్రమాణం ఉంటుందా అని ఆశావహులు ఉత్కంఠకు గురవుతున్నారు.

Telangana cabinet expansion : ఉగాదికి తెలంగాణ కేబినెట్ విస్తరణ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుని ఢిల్లీ నుంచి వచ్చే జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణ కోసం ఎలాంటి సమాచారం కాంగ్రెస్ నేతలకు అందలేదు. ఆదివారం ఉగాది పండుగ. ఆ రోజు మంచి రోజు అని ప్రమాణ స్వీకారాలు ఉంటాయని అనుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సమాచారం వస్తే సీఎం గవర్నర్ తో మాట్లాడి ప్రమాణ స్వీకారాన్ని ఖరారు చేస్తారు. ఇందు కోసం గాంధీభవన్ లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకూ గాంధీభవన్ కు ఎలాంటి సూచనలు వెళ్లలేదు.
ఒక వేళ ఈ రాత్రికి సమాచారం వస్తే.. రాజ్ భవన్ ఆఘమేఘాలపై ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఆరు మంత్రి పదవుల కోసం ఇరవై మంది వరకూ పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాలు, ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం వంటివి చూసుకుని పదవుల్ని ఎంపిక చేస్తే ఎక్కువ మంది అసంతృప్తికి గురవుతారు. అలాగని ఈ సమీకరణాలు చూసుకోకుండా పదవులు ఇవ్వలేరు. అందుకే కాంగ్రెస్ జాబితా ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు.
ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజికవర్గాలను బేస్ చేసుకుని నలుగురి పేర్లను ఫైనల్ చేశారని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఎస్సీ, బీసీ, ముస్లిం, రెడ్డి వర్గాల ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారని అంటున్నారు. ఎస్సీ వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ప్రధానంగా రేసులో ఉన్నారు. ఆయనకు ఉన్న బ్యాక్ గ్రౌండ్, తండ్రి వెంకటస్వామికి కాంగ్రెస్ లో ఉన్న రికార్డు అన్నీ కలిసి వచ్చి ఆయన మంత్రి కావడం ఖాయమని చెబుతున్నారు. అయితే తనకు చాన్స్ ఇవ్వాల్సిందేనని ప్రేమ్ సాగర్ రావు కూడా పోటీ పడుతున్నారు.
బీసీ వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ పేర్లు తుది దశలో ఉన్నాయి. ముదిరాజ్ వర్గానికి ఇవ్వాలనుకుంటే వాకిటి శ్రీహరికి.. మున్నూరు కాపులకు ఇవ్వాలనుకుంటే ఆది శ్రీనివాస్ కు ఇస్తారు. మున్నూరు కాపు వర్గం నుంచి ఇప్పటికే కొండా సురేఖ ఉన్నారు. దీంతో శ్రీహరికే ఖరారవుతుందని అంటున్నారు. మరొకిరికి కేబినెట్ హోదాతో పోస్టు ఇచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మైనార్టీ వర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చిన అమీర్ అలీ ఖాన్ కు అవకాశం రావొచ్చని భావిస్తున్నారు. అయితే అజారుద్దీన్ తో పాటు నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు.
ఇక రెడ్డి వర్గం కోసం కేటాయించే స్థానంలో కోసం చాలా పోటీ ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండటంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అడ్వాంటేజ్ గా మారింది. రెండు స్థానాలను ఖాళీగా ఉంచాలని అనుకుంటున్నారు. తీవ్రమైన ఒత్తిడి వస్తే మరో స్థానం భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. హైకమాండ్ ఒత్తిడి పెంచేందుకు పలువురు నేతలు ఢిల్లీ బాట పడుతున్నారు. మీనాక్షినటరాజన్ తో పాటు మల్లికార్జున్ ఖర్గేను కలిసి తమ విజ్ఞప్తులు ఇచ్చి వస్తున్నారు.





















