Fleming Vs Pujara: సీఎస్కే ఆ కారణంతోనే ఓడింది.. ఇప్పటికైనా సరికొత్త ప్రణాళికలతో రావాలి.. మాజీ ప్లేయర్ విశ్లేషణ
ఇటీవల హోమ్ అడ్వాంటేజీ లేదని కొన్ని జట్లు ఆరోపిస్తున్నాయి.తాజాగా చెన్నై జట్టు కూడా ఈ పల్లవి అందుకుంది. అయితే తాజా ఓటమిపై మాజీ ప్లేయర్ తన విశ్లేషణను చెప్పాడు. చెన్నై ఓటమికి కారణాలను చెప్పాడు.

IPL 2025 CSK VS RCB Updates: ఐదుసార్లు చాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా సొంతగడ్డపై చేజింగ్ లో ఘోర ఓటమిని నమోదు చేసింది. రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 50 పరుగులతో పరాజయం పాలైంది. అయితే ఈ ఓటమిపై ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పిన కారణం మాత్రం కాస్త విచిత్రంగానే అనిపిస్తోంది. తమ జట్టుకు హోమ్ అడ్వాంటేజీ లేదని, జట్టు బలాబలాలకు సంబంధించిన పిచ్ ను రూపొందించడంలో క్యూరెటర్ సహకరించడం లేదని పేర్కొన్నాడు. దీంతో తమకు ఓటమి ఎదురైందని పేర్కొన్నాడు. తమ జట్టుకు కావల్సిన రీతిలో పిచ్ ఉంటే, టోర్నీలో సత్తా చాటగలమని విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై లాంటి జట్టు ఓటమిపై సాకులు వెతుకుతోందని, ఆ జట్టు తలుచుకుంటే ఎలాంటి పిచ్ అయినా రూపొందించుకునే అవకాశముంటుందని పలువురు మాజీలు పేర్కొంటున్నారు.
దిగ్గజ జట్ల ఆరోపణ..
ఇక తమకు కావాల్సిన పిచ్ లు రూపొందించడంల లేదని చెన్నైతోపాటు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరచూ ఆరోపిస్తున్నాయి. అయితే ఐపీఎల్లో మిగతా జట్లతో పోలిస్తే చెన్నై, ముంబై ఇండియన్స్, కోల్ కతా జట్లకు చాలా ఇన్ఫ్లూయెన్స్ ఉంటుందని, తమ పలుకుబడితో ఎలాంటి పిచ్ లు అయిన రూపొందించుకునే అవకాశం ఉంటుందని చటేశ్వర్ పుజారా వ్యాఖ్యానించాడు. 2021లో చెన్నై తరపున ఆడిన పుజారాకు ఆ జట్టు గురించి బాగా తెలుసు. తాజాగా ఫ్లెమింగ్ వ్యాఖ్యలపై తను విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. చెన్నై ఓటమికి గల కారణాలను తను విశ్లేషించాడు. ముఖ్యంగా జట్టులోని బ్యాటింగ్ ఆర్డర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆ కారణంతోనే ఓటమి..
సీఎస్కే ఓటమికి ప్రధాన కారణం బలహీనమైన మిడిలార్డరే కారణమని పుజారా విశ్లేషించాడు. ముఖ్యంగా టాపార్డర్ లోని రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ లపై జట్టు ఎక్కువగా ఆధారపడుతోందని తెలిపాడు. వాళ్లు విఫలమైతే మిడిలార్డర్ కూడా కుప్పుకూలుతోందని, మిడిలార్డర్లోని శివమ్ దూబే, దీపక్ హూడా, శామ్ కరన్ స్థాయికి తగ్గట్లు రాణించాలని సూచించాడు. అప్పుడే జట్టు ఎక్కువగా విజయాలు సాధిస్తుందని పేర్కొన్నాడు. ఇక చెన్నై టీమ్ ఆట కూడా సాధారణంగా ఉందని, 160-170 పరుగులను ఛేజ్ చేస్తోందని, 170 పరుగుల టార్గెట్ ను డిఫెండ్ చేసుకుంటోందని గుర్తు చేశాడు. అయితే మిగతా జట్లు దూకుడే మంత్రంగా ఆడుతున్న నేపథ్యంలో చెన్నై బ్యాటర్లు కూడా ఆటతీరులో మార్పు చేసుకోవాలని తెలిపాడు. అప్పుడే ఆ జట్టు విజయాల బాట పడుతుందని వ్యాఖ్యానించాడు. మొత్తానికి పిచ్ మీద నెపం మానివేసి, సరికొత్త ప్రణాళికలతో ముందుకు రావాలని సూచించాడు. ఇలా సరికొత్తగా ఆవిష్కరించుకుంటూనే, టోర్నీలో చెన్నై ముందడగు వేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. ఇక గతేడాది ప్లే ఆఫ్స్ కు చేరడంలో చెన్నై విఫలమైంది. ఈసారి ఆరో టైటిల్ సాధించాలని చెన్నై పట్టుదలగా ఉంది. ఈ ఘనత సాధిస్తే టోర్నీలో నే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




















