ATM Withdrawal Fee: ATM నుంచి డబ్బు తీస్తే రూ.23 బాదుడు, తస్మాత్ జాగ్రత్త!
ATM Interchange Fee: ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌ను పెంచాలన్న NPCI ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆమోదించింది. ఈ ప్రభావం నేరుగా ప్రజలపై పడుతుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలపై ఎక్కువగా ఉంటుంది.

RBI Hikes ATM Withdrawal Fee, Effective May 2025: దగ్గరలోనే ఏటీఎం ఉంది, జేబులో కార్డ్ ఉంది కదాని ఎప్పుడంటే అప్పుడు క్యాష్ విత్‌డ్రా చేయాలని చూశారో.. ఛార్జ్ పడుద్ది. ATM లావాదేవీలపై విధించే ఛార్జీలను రిజర్వ్ బ్యాంక్ (RBI) పెంచింది. అయితే, ఒక నెలలో ఉచిత లావాదేవీల పరిమితికి మించి ATMలో లావాదేవీలు చేస్తేనే ఈ ఛార్జ్ పడుతుంది, నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. మే 01, 2025 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది.
ఒక నెలలో ఉచిత లావాదేవీల పరిమితికి మించి ATMలో లావాదేవీలు చేస్తే, ప్రతి అదనపు లావాదేవీలపై ప్రస్తుతం విధిస్తున్న ఉపసంహరణ రుసుము మరో రూ. 2 పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. అంటే, మే 01వ తేదీ నుంచి, ఉచిత పరిమితి దాటిన ప్రతి లావాదేవీకి కస్టమర్ల నుంచి రూ.23 వసూలు చేస్తారు. ప్రస్తుతం, ఈ ఛార్జీ ప్రతి లావాదేవీకి రూ. 21గా ఉంది. ఈ రుసుమును ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ (ATM Interchange Fee) అంటారు.
ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ అంటే?
హోమ్ బ్యాంక్ కాకుండా, ఇతర బ్యాంక్ ATMను ఉపయోగించుకుంటే (క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ చెకింగ్ వంటివి) వసూలు చేసే ఫీజ్‌నే ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ అంటారు. ఉదాహరణకు, మీ దగ్గర SBI ఏటీఎం కార్డ్ ఉంటే, ఆ కార్డ్‌ను ఉపయోగించి వేరే బ్యాంక్ ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేయడం, నగదు నిల్వ తెలుసుకోవడం వంటివి చేస్తే ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ పేరిట మీరు కొంత ఛార్జీ చెల్లించాలి. ఉచిత లావాదేవీలన్నీ పూర్తయిన తర్వాతే ఈ ఛార్జీ వర్తిస్తుంది.
కస్టమర్‌కు ఎన్ని ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి?
కస్టమర్‌కు, ఇప్పటికీ వారి సొంత (హోమ్) బ్యాంకు ATMలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలకు (ఆర్థిక & ఆర్థికేతర కలిపి) అనుమతి ఉంది. అదనంగా, ఇతర బ్యాంకుల ATMలలో కొన్ని ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలను మెట్రో నగరాల్లో 3 సార్లు & ఇతర ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాతే, ప్రతి లావాదేవీకి రూ. 23 చొప్పున ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ వర్తిస్తుంది.
RBI, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రెండూ నగదు ఉపసంహరణలపై ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌లో రూ. 2 పెంపును ఆమోదించాయి. మార్చి 13న, సభ్య బ్యాంకులకు ఈ మార్పు గురించి NPCI సమాచారం పంపింది. సవరించిన రుసుములు మే 01, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.
వాస్తవానికి, వైట్ లేబుల్ ATM ఆపరేటర్ల సంఘం ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెంపు కోసం సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తోంది. ATM నిర్వహణ వ్యయాలు పెరుగుతున్నాయని, ప్రస్తుత ఫీజ్‌లు తమకు లాభదాయకం కాదని వాదించింది. గత ఏడాది జూన్ 13వ తేదీన, ATM ఆపరేటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం ఇంటర్‌ఛేంజ్ రుసుమును రూ. 23కి పెంచే ప్రతిపాదన తీసుకొచ్చింది. AMI నిర్వహణ కార్యకలాపాలను కొనసాగించడానికి, లాభదాయకంగా మారడానికి రుసుమును పెంచాలని ఆ సంఘం తన ప్రతిపాదనలో సూచించింది. ఏదైనా బ్యాంక్ తరపున ఒక ప్రైవేట్ సంస్థ ATM ఏర్పాటు చేసి & నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంటే, దానిని వైట్ లేబుల్ ఏటీఎం (White Label ATM) అని పిలుస్తారు. బ్యాంక్ తరపున ATMను నిర్వహిస్తున్నందుకు, సదరు బ్యాంక్ ఆ ప్రైవేట్ సంస్థకు ఏటా కొంత ఫీజ్ చెల్లిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

