AnTuTu Score: మీ మొబైల్ ఆంటుటు స్కోర్ ఎంతో మీకు తెలుసా, అసలేంటీ నంబర్?
What is AnTuTu Score: సాధారణంగా, ఆంటుటు స్కోర్ 2,00,000 నుంచి స్టార్ అవుతుంది. ఫోన్ కెపాసిటీ రేంజ్‌ను బట్టి పెరుగుతుంది.

Checking Antutu Score When Buying A Mobile: మొబైల్ ఫోన్ టెక్నాలజీ రోజురోజుకూ మారిపోతోంది. ఐదేళ్ల క్రితం స్మార్ట్‌ఫోన్‌కు, ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు భారీ వ్యత్యాసాలు కనిపిస్తాయి. కనిపించే స్క్రీన్ నుంచి కనిపించని ప్రాసెసర్ వరకు టెక్నాలజీ చాలా మారింది. గేమింగ్, కెమెరా విషయాల్లో ఇప్పుడు మొబైల్ కంపెనీలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. బోలెడన్ని బ్రాండెడ్ ఫోన్‌లు మార్కెట్‌లో కనిపిస్తు ఈ రోజుల్లో, ఒక మంచి ఫోన్ ఎంచుకోవడం కష్టమైన పనే. క్రెడిట్ స్కోర్‌ను బట్టి బ్యాంక్ కస్టమర్‌ను అంచనా వేసినట్లు, ఏదైనా బెంచ్‌మార్క్‌ను బట్టి స్మార్ట్ ఫోన్‌ను ఎంచుకుంటే ఎంత బాగుంటుంది?. మొబైల్ ఫోన్ కెపాసిటీని వివరించే అలాంటి బెంచ్‌మార్క్‌ల్లో ఒకటి అంటుటు స్కోర్ (Antutu Score).
ఆంటుటు స్కోర్ అంటే?
మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్ కెపాసిటీ గురించి వెల్లడించే బెంచ్‌మార్క్‌ల్లో ఆంటుటు స్కోర్ ఒకటి. గీక్‌బెంచ్, 3డీ మార్క్ వంటి ఇతర బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఆంటుటు స్కోర్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మనం పరీక్ష రాస్తే మార్కులు వేసినట్లు.. స్మార్ట్ ఫోన్ వేగం, గ్రాఫిక్స్ క్వాలిటీ, ర్యామ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ వంటి పనితీరులను పరీక్షించి, దానికి ఒక స్కోర్ నిర్ణయిస్తారు. దానినే ఆంటుటు స్కోర్ అంటారు. ఈ స్కోర్‌ను బట్టి మొబైల్ ఫోన్‌లు కొనేవాళ్ల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ఆంటుటు స్కోర్‌ను పెంచుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆంటుటు స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫోన్ పనితీరు అంత వేగంగా పని చేస్తుందని అర్ధం. ఉదాహరణకు 5,00,000 ఆంటుటు స్కోర్ ఉన్న మొబైల్ కంటే 15,00,000 ఆంటుటు స్కోర్ ఉన్న ఫోన్ 3 రెట్ల వేగంతో పని చేస్తుంది. మల్టీటాస్కింగ్ లేదా భారీ గ్రాఫిక్స్ ఉన్న ఆన్‌లైన్ గేమ్స్ ఆడినా ఫోన్ స్తంభించిపోకుండా, వేగంగా పని చేస్తుంది.
స్కోర్ ఎంత ఉండాలి?
సాధారణంగా, బేసిక్ లెవల్ మొబైల్ ఫోన్‌లలో 2,00,000 నుంచి 4,00,000 ఆంటుటు స్కోర్ ఉంటుంది. ఫోన్ చేయడం, SMS పంపడం, సాధారణ యాప్‌లను ఉపయోగించుకోవడానికి, సాధారణ ఫోటోలు తీయడానికి ఈ స్కోర్ చాలు. మిడ్ రేంజ్ ఫోన్లలో ఆంటుటు స్కోర్ 4,00,000 నుంచి 7,00,000 వరకు ఉంటుంది. ఓ మాదిరి ఆన్‌లైన్ గేమ్స్ అడడానికి, నాలుగైదు యాప్స్ ఒకేసారి ఓపెన్ చేయడానికి ఈ స్కోర్ ఉన్న ఫోన్‌లు సూటవుతాయి. ప్రీమియం ఫోన్లలో ఆంటుటు స్కోర్ 7,00,000 నుంచి 15,00,000 పైగా ఉంటుంది. ఈ స్కోర్ ఉన్న ఫోన్‌లలో భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడడంతో పాటు, వీడియో ఎడిటింగ్ వంటివి కూడా చేయవచ్చు. POCO కంపెనీ త్వరలో తీసుకురాబోతున్న F7 సిరీస్ ఫోన్‌లలో ఆంటుటు స్కోర్ 28,00,000 లక్షలకు పైగా ఉంటుందని ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
మీ ఫోన్ ఆంటుటు స్కోర్ ఇలా చెక్ చేయండి
ఆంటుటు యాప్‌లో ఈ స్కోర్ చెక్ చేయాలి. అయితే, ఇది చైనా కంపెనీ కాబట్టి ప్లే స్టోర్‌లో కనిపించదు. మీరు ఆంటుటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్కోర్‌ను చెక్ చేసుకోవచ్చు లేదా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంటుటు వెబ్‌సైట్‌లో స్కోర్ చెక్ చేయడానికి, ముందుగా ఆ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. మెనూలో మీకు ‘Ranking’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే, మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్‌ల ఆంటుటు స్కోర్ డిస్‌ప్లే అవుతుంది. మీ ఫోన్ మోడల్‌ను ఎంటర్ చేసి స్కోర్ తెలుసుకోవచ్చు. లేదా, మీ ఫోన్ మోడల్ ఆంటుటు స్కోర్ ఎంత అని గూగుల్‌లో సెర్చ్ చేసినా తెలిసిపోతుంది. ఆ రిజల్ట్‌లో - యావరేజ్ ఆంటుటు స్కోర్‌తో పాటు, ఫోన్ వేగం (CPU), గ్రాఫిక్స్ (GPU), ర్యామ్ (RAM), యూజర్ ఎక్స్‌పీరియన్స్ (UX)కు వచ్చిన స్కోర్‌లు కూడా విడివిడిగా కనిపిస్తాయి.
ఆంటుటు స్కోర్‌ను నమ్మొచ్చా?
భారీ గ్రాఫిక్స్ ఉన్న ఆన్‌లైన్ గేమ్స్‌ను మొబైల్ ఫోన్‌లో ఆడేవాళ్లకు ఆంటుటు స్కోర్ అవసరం, మిగిలినవాళ్లు దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక అవగాహన కోసం ఆంటుటు స్కోర్ చూడాలి తప్ప, దానిని పూర్తిగా నమ్మలేమని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మొబైల్ కంపెనీలు వెల్లడించిన ఆంటుటు స్కోర్‌కు, వాస్తవంగా అవి పని చేసే వేగానికి అంతరం ఉండొచ్చని అంటున్నారు.





















