Drone Delivery: ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వండి, వస్తువులు ఆకాశం నుంచి ఊడిపడతాయ్!
Drone Delivery In Bangalore: డ్రోన్ డెలివరీ ప్రవేశపెట్టడంతో, రాబోయే రోజుల్లో బెంగళూరులో ఇ-కామర్స్ & క్విక్ కామర్స్ విభాగాల్లో పెను మార్పులు ఉండబోతున్నాయని స్కై ఎయిర్ కంపెనీ తెలిపింది.

Skye Air Drone Delivery Started In Bengaluru: మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువు ఆకాశం నుంచి నేరుగా మీ ఇంటి ముందు ఊడి పడుతుందని ఎవరైనా చెబితే నమ్ముతారా?. ఇప్పటి వరకు ఏమోగానీ, ఇప్పుడు మాత్రం నమ్మక తప్పదు. ఏదైనా వస్తువును ఆర్డర్ బుక్ చేసిన 10 నిమిషాల లోపు, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే కేవలం 7 నిమిషాల్లో ఇంటి గుమ్మం వద్దకు చేరుతుంది, అదీ ఆకాశం నుంచి దిగి వస్తుంది. ఇది నిజం. ఇందులో నూతన సాంకేతికత వినియోగం తప్ప ఎలాంటి మాయ లేదు, మర్మం లేదు. భారతదేశ ఐటీ హబ్ బెంగళూరులో, ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా వస్తువులను డెలివరీ చేయడం ప్రారంభమైంది. అంటే, మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తిని, డ్రోన్ మీ ఇంటి గుమ్మం వద్దకు తీసుకువస్తుంది. ఆకాశం నుంచి వస్తువులు ఊడిపడడం అంటే ఇదే.
బెంగళూరులో, హైపర్‌లోకల్ డ్రోన్ డెలివరీ నెట్‌వర్క్ "స్కై ఎయిర్" (Skye Air Mobility Private Limited), తన అల్ట్రా-ఫాస్ట్ డ్రోన్ డెలివెరీ సర్వీస్‌ను ప్రారంభించింది. డ్రోన్ డెలివరీ సేవలతో, రాబోయే రోజుల్లో బెంగళూరులో ఇ-కామర్స్ & క్విక్ కామర్స్‌లో పెద్ద మార్పు రాబోతోందని స్కై ఎయిర్ కంపెనీ స్పష్టం చేసింది. వాస్తవానికి, స్కై ఎయిర్ కంపెనీ తన డ్రోన్ డెలివెరీ సర్వీస్ ప్రారంభించి రెండో నగరం బెంగళూరు. ఈ కంపెనీ గురుగావ్‌లో తొలిసారి ఈ సేవలు ప్రారంభించింది, అక్కడ మంచి స్పందన వస్తోందని తెలిపింది.
7 నిమిషాల్లో డ్రోన్ డెలివెరీ
బెంగళూరులోని కోణనకుంట, కనకపుర రోడ్డు ప్రాంతాల్లో కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే సరుకులు డెలివెరీ చేస్తామని స్కై ఎయిర్ కంపెనీ ఫౌండర్ & CEO అంకిత్ కుమార్ చెప్పారు. డ్రోన్‌ల ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం వేగంగా వస్తువులను డెలివరీ చేయడంతో పాటు, పర్యావరణ హితంగానూ ఉంటుందని వెల్లడించారు.
స్కై ఎయిర్ సంస్థ గత కొన్ని రోజుల నుంచి బెంగళూరులో ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. నమూనా పరీక్షలు సంతృప్తికరంగా ఉండడంతో ఇప్పుడు వస్తువుల డెలివెరీకి సిద్ధమైంది. ప్రస్తుతం, బ్లూడార్ట్ (Bluedart), డీటీడీసీ (DTDC), షిప్‌రాకెట్ (Shiprocket), ఈకామ్ ఎక్స్‌ప్రెస్ (Ecom Express), శ్రీమారుతి (Shree Maruti) తదితర సంస్థలకు చెందిన ఆర్డర్లు పంపిణీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. త్వరలో ఆహార పదార్థాల డెలివెరీలోకి కూడా అడుగు పెడతామని వెల్లడించింది.
డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ..
10 కిలోల బరువును మోయడం ఈ డ్రోన్ ప్రత్యేకత. ట్రాఫిక్ రద్దీతో సంబంధం లేకుండా ఆకాశంలో ప్రయాణిస్తుంది. భూమి నుంచి 120 మీటర్ల ఎత్తులో ఎగురుతూ గమ్యస్థానాన్ని అంటే కస్టమర్‌ను చేరుకుంటుంది. ఈ డ్రోన్ టన్నెల్‌లోనూ ప్రయాణించగలదట. వస్తువుల డెలివెరీ పూర్తయిన తర్వాత తిరిగి అదే రూట్‌లో ప్రయాణించి బయల్దేరిన చోటుకు చేరతాయని కంపెనీ తెలిపింది. విమానాల తరహాలోనే ఈ డ్రోన్‌లలో బ్లాక్‌బాక్స్‌లు కూడా ఉంటాయని వెల్లడించింది.
స్కై ఎయిర్ కంపెనీ, ఇప్పటికే, SRL డయాగ్నోస్టిక్స్, అపోలో హాస్పిటల్‌తో కలిసి పని చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, టాటా1ఎంజీ వంటి ఇ-కామర్స్ కంపెనీలతోనూ పని చేస్తోంది. ఇప్పటివరకు, స్కై ఎయిర్ డ్రోన్లు 7,500 కిలోల వస్తువులను డెలివరీ చేశాయి. 11,500 కి.మీ. దూరాన్ని కవర్ చేస్తూ 2,150 సార్లు తిరిగాయి.





















