MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత
Telangana News: తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ కొడుతున్న కాంగ్రెస్ స్వరూపాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. జగిత్యాలలో పర్యటించిన ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి శంకుస్థాపన చేశారు.
BRS MLC Kavitha News: తెలంగాణ తల్లి విగ్రహంపై దుమారం ఇప్పట్లో చెల్లారేలా కనిపించడం లేదు. దీని కేంద్రంగానే ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వం రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంగీకరించబోమని చెబుతున్న బీఆర్‌ఎస్... భారీ ఎత్తున ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా జగిత్యాలలో పర్యటించిన ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. ఇరవై రెండు అడుగుల పాత తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
జగిత్యాలలో కవితకు ఘన స్వాగతం
చాలా కాలం తర్వాత జగిత్యాలలో పర్యటించిన కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారు. ధరూర్ బైపాస్ వద్ద కవితకు గజమాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అక్కడే అంబేడ్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన కవిత... మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మ విగ్రహానికి భూమి పూజ చేశారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
గ్రామ గ్రామంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలు: కవిత
ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా వెనక్కి తగ్గకుండా తెలంగణ తల్లి విగగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు కవిత. ప్రతి గ్రామంలో ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చినా ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఆ తల్లినే తాము ఆరాధిస్తామన్నారు. తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం అన్నారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతామని తెలిపారు.
సంజయ్ పార్టీ ఫిరాయింపుపై కవిత ఫైర్
జగిత్యాల అంటేనే బీఆర్ఎస్ అడ్డా అని అభిప్రాయపడ్డారు కవిత. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారడంపై కవిత ఫైర్ అయ్యారు. అలాంటి ప్రాంతం నుంచి కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్... ఏ మొహం పెట్టుకొని బీఆర్‌ఎస్ లీడర్లను, కేసీఆర్‌ను విమర్శిస్తారని ప్రశ్నించారు. పార్టీ మారిన తర్వాత నియోజకవర్గానికి ఏమైనా మంచి జరిగిందా అంటూ ప్రజలను అడిగారు. నియోజకవర్గానికి రూపాయి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. తన సొంత లాభం కోసమే సంజయ్ పార్టీ మారారని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే: కవిత
జిగిత్యాల ప్రజలు భయపడాల్సిన పని లేదని ప్రజలకు అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు కవిత. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుందని అన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇప్పటి వరకు అమలు చేసిన హామీలు లేవని ఇకపై కూడా చేయలేరని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు.
Also Read: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్