Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
Andhra Pradesh: వల్లభనేని వంశీ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. చీఫ్ గా ఏలూరు డీఐజీకి బాధ్యతలు ఇచ్చారు.

Vallabhaneni Vamsi in trouble: ఫిర్యాదుదారుడ్ని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీ అక్రమాలను తేల్చడానికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ పని చేస్తుంది. సభ్యులుగా మరో ఇద్దర్ని నియమించారు. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి, గ్రావెల్ తవ్వకంతో పాటు చాలా అభియోగాలు ఆయనపై ఉన్నాయి. వాటన్నింటినీ తేల్చడానికి ప్రభుత్వం సిట్ ను నియమించింది.
వల్లభనేని వంశీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల పరిధిలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరిగాయని ఇప్పటికి విజిలెన్స్ నివేదిక రెడీచేసింది. కొండలను, చెరువులను, వాగులను, తోటలను వదిలి పెట్టకుండా మైనింగ్ చేశారు.
వెదురుపావులూరు, కొండపావులూరులో 300 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న కొండ ప్రాంతాన్ని భారీ పేలుళ్లతో పిండి చేసినట్లుగా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సూరంపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 526లోని 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోకతిప్పను కూడాతవ్వేశారని గ్రామస్తులు అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. మల్లవల్లిలోని సర్వే నెంబర్ 11లో 175 ఎకరాల్లో గ్రానైట్ ను పోర్టు పనుల పేరుతో తవ్వుకున్నారు. గన్నవరం మండలం పరిధిలోనే ముస్తాబాద, చనుపల్లివారిగూడెం కొండలను కూడా అనధికారికంగా మైనింగ్ చేశారని అధికారులు గుర్తింంచారు. అన్నీ వంశీ వెనుకుండి చేయించారని భావిస్తున్నారు. మట్టి తవ్వకంపైనా ఆరోపణలు ఉన్నాయి. నాలుగు మండలాల పరిధిలో 80 శాతానికి పైగా చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కాకుండా.. నకిలీ ఇళ్ల స్థలాల పట్టాల దగ్గర నుంచి ఇసుక వరకూ వంశీ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదని అంటున్నారు.గన్నవరం నియోజవర్గంలో రేషన్ బియ్యం దందాతో పాటు గుట్కా, గంజాయి అమ్మకాల విషయంలోనూ వంశీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం నిగ్గు తేల్చే అవకాశం ఉంది. నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరంలో వంశీ చేసిన అక్రమాల చిట్టాను బయటకు తీశారు. విజిలెన్స్ తో దర్యాప్తు చేయించారు . అన్నీ ఆధారాలతో సహా రెడీ చేయించి ఇప్పుడు సిట్ ద్వారా చర్యలు తీసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారని భావిస్తున్నారు. ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న వంశీ ఇప్పుడల్లా బయటకు వచ్చే చాన్స్ లేకుండా కేసుల వల బిగిస్తున్నట్లుగా తాజా పరిణామాలతో అర్థమవుతోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా





















