Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Telangana Crime News:హైదరాబాద్‌లో ముగ్గురు చిన్నారులు మృతి కలకలం రేపుతోంది. అన్నం తిన్న తర్వాత పడుకున్న చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు. తల్లి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది.

Telangana Crime News: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ముగ్గురు చిన్నారుల మృతి సంచలనంగా మారుతోంది. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన చెన్నయ్య అమీన్‌పూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నాడు. డ్రైవర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య పేరు రజిత. వీళ్లకు ముగ్గురు పిల్లలు. గురువారం రాత్రి తిని చెన్నయ్య పనికి వెళ్లిపోయాడు. భార్య పిల్లలు తిని పడుకున్నారు. పని నుంచి తిరిగి వచ్చేసరికి అంతా పడుకునే ఉన్నారు. వేకువజామున కడుపునొప్పితో భార్య గిలగిల కొట్టుకుంది.
కడుపునొప్పితో బాధపడుతున్న భార్యను స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించాడు చెన్నయ్య. ఆ తర్వాత పిల్లల్ని చూస్తే అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. మళ్లీ స్థానికులను పిలిచి పరిశీలిస్తే ముగ్గురు మృతి చెందినట్టు గుర్తించారు. వారిని అలా చూసిన వారంతా షాక్ అయ్యారు. చెన్నయ్య అయితే కుప్పకూలిపోయాడు.
ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ముగ్గురు చనిపోయారనే విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఏం జరిగిందో ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నీళ్ల బకెట్‌లో ముంచి చంపేసింది
మైలార్‌దేపల్లిలో మరో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన మహిళ తన 14 రోజుల కుమార్తెను చంపేసింది. మహిళ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. అదే టైంలో పాప పుట్టింది. పోషణ ఇబ్బంది అవుతుందని నీళ్ల బకెట్‌లో పడేసి హత్య చేసింది. భర్త వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాక కేసు నమోదు చేశారు.
పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భోలక్‌పూర్‌లో అత్తింటి వేధింపులు భరించ లేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు జిమ్ నిర్వాకుడితో నాలుగు నెలల క్రితమే వివాహమైంది. అనారోగ్య సమస్యలు గురించి చెప్పకుండా పెళ్లి చేశారని వేధిస్తూ వచ్చారు. వాటిని భరించలేక సూసైడ్ చేసుకుంది. పుట్టింటికి వచ్చి మూడంతస్తుల భవనం పైనుంచి దూకి చనిపోయింది.
బంజారాహిల్స్‌లో యువకులు గన్‌తో హల్‌చల్
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో యువకులు గన్‌తో హల్‌చల్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 26న నెంబర్ ప్లేట్ లేని వాహనంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్ లో యువకుల హల్చల్ చేశారు. ఓ యువకుడు అతివేగంగా వాహనాన్ని నడుపుతుంటే... మరో యువకుడు గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన చూసిన ప్రలు భయభ్రాంతులకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్దపల్లిలో పరువు హత్య
పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. పూరేళ్ల పరశురాములు, జోష్ణ దంపతుల కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్నేహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకుంటున్న టైంలో హత్య చేశారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమనే అనుమానం వ్యక్తమవుతున్నాయి.





















