CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
Andhra Pradesh News | వైసీపీ హయాంలో ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదలాయింపు పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Supreme Court On Chandrababu Cases | న్యూఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేసి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టు లాయర్ బి. బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బేలా త్రివేది విచారణ చేపట్టారు. సీబీఐకి కేసుల బదలాయింపు పిటిషన్ ను డిస్మిస్ చేశారు. ఇది సరైన పిటిషన్ కాదని, దీనిపై ఒక్క మాట ఏమైనా మాట్లాడినా భారీగా జరిమానా విధిస్తామని జస్టిస్ బేలా త్రివేది సూచించారు.
వైసీపీ హయాంలో చంద్రబాబుపై ఏడు సీఐడీ కేసులు నమోదయ్యాయి. పిటిషనర్ బాలయ్య తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ లాయర్ మణిందర్ సింగ్ ఓకే చేయడంపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు సీనియర్ లాయర్ అయిన మీలాంటి వ్యక్తి వాదించడానికి హాజరవుతారని అసలు ఊహించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై పలు కేసు నమోదు కాగా, అప్పటికప్పుడు నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఏడు వారాలకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబు బెయిల్ రావడంతో విడుదలయ్యారు. బౌన్స్ బ్యాక్ అయిన చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసి గత ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించి నవ్యాంధ్రకు రెండోసారి, ఓవరాల్గా నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.