Sports Budget 2025-26: ఖేలో ఇండియాకు భారీగా కేటాయింపులు.. గతేడాదితో పోలిస్తే క్రీడాలకు తోడ్పాటు.. ఒలింపిక్స్ నిర్వహణే లక్ష్యంగా..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమానికే సింహభాగం నిధులు కేటాయించారు. 2025-26 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

Union Budget 2025 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వివిధ శాఖలకు బడ్జెట్ కేటాయింపులను వివరించారు. క్రీడా రంగానికి గతేడాదితో పోలిస్తే రూ.350 కోట్లు అదనంగా కేటాయించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా కార్యక్రమానికే సింహభాగం నిధులు కేటాయించారు. 2025-26 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25 శాతం అదనంగా అంటే రూ.200 కోట్లను అధికంగా కేటాయించడం విశేషం. మొత్తానికి క్రీడా శాఖకు రూ.3794.30 కోట్లను కేటాయించింది. వివిధ పద్దుల కింద ఈ నిధులను పంపిణీ చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే రూ.351.98 కోట్లను అధికంగా కేటాయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్ లాంటివి ఏమీ లేకున్నా ఒక్క ఏడాదికే ఇంత పెద్ద మొత్తాన్ని పెంచడం విశేషం. అలాగే జాతీయ క్రీడా సంఘాలకు ఇచ్చే నిధులను కూడా రూ.340 కోట్ల నుంచి రూ.400 కోట్లకు పెంచారు. ఇండియా 2036 ఒలింపిక్స్ ను నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. అందుకుగాను ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని భావిస్తోంది.
Sports Budget 2025-26: 3794 cr approx. Marginal increase.#UnionBudget2025 pic.twitter.com/lfC1sKSENy
— Rambo (@monster_zero123) February 1, 2025
సాయ్ కే ఎక్కువ వాటా..
కేంద్రం కేటాయించిన నిధుల్లో ఖేలో ఇండియా తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కి అధికమొత్తంలో నిధులు కేటాయించారు. బడ్జెట్లో రూ. 822.60 కోట్లను కేటాయించారు. అలాగే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కు రూ.22.30 కోట్లను కేటాయించింది. ఇక నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబోరేటరీ (ఎన్డీటీఎల్)కు రూ.32 కోట్లను కేటాయించింది.
2036 ఒలింపిక్స్ కు ఇప్పటి నుంచే సన్నాహకాలు..!
ప్రపంచంలోని సూపర్ పవర్ అనదగ్గ అన్ని దేశాలు ఒలింపిక్స్ ను నిర్వహించాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఈవెంట్ను నిర్వహించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. క్రీడల్లో ఒలింపిక్స్ ఉన్న క్రేజ్ సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఈ టోర్నీని ఒక్కసారైనా నిర్వహించాలని కలలు కంటుంటాయి. ఇప్పటికే దాదాపు అగ్రదేశాలన్నీ ఈ టోర్నీని నిర్వహించి, సత్తా చాటాయి. చైనా, బ్రెజిల్ కూడా ఈ టోర్నీని నిర్వహించిన తమ శక్తియుక్తుల్ని ప్రపంచానికి చాటాయి. బిలియన్ డాలర్లలో అయ్యే ఈ నిర్వహణ ఖర్చును భరించడం చాలా కష్టమే. గ్రీస్ లాంటి దేశాలు దీన్ని నిర్వహించి దివాళా కూడా తీశాయి. అయినప్పటికీ ఒలింపిక్స్ ను నిర్వహించడంలో ఉన్న మజాను దక్కించుకునేందుకు వివిధ దేశాలు ఎప్పటికప్పుడు పోటీపడుతుంటాయి. తాజాగా భారత్ కూడా ఈ ఒలింపిక్స్ పోటీలను నిర్వహించాలని పావులు కదుపుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2036 ఒలింపిక్స్ కు భారత్ వేదికయ్యే అవకాశముంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఇప్పటికే భారత ఒలింపిక్ అసోసియేషన్ క్రీడల నిర్వహణ సానుకూలతను వివరిస్తూ ఒక లేఖను సమర్పించింది. గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మెగాటోర్నీని నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఏర్పాట్లు చేయడానికి గాను బడ్జెట్లో నిధులు పెంచి, ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

