Electric Vehicles: ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు రయ్.. రయ్ - బడ్జెట్ ప్రభావంతో ధరలు దిగిరానున్న ఈవీలు, వాయు కాలుష్యానికి చెక్!
Union Budget 2025: తాజా బడ్జెట్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలపై భారీగా ప్రభావం చూపబోతోంది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోహత్సహించడమే కేంద్రం సరికొత్త వ్యూహం.

ABP Exclusive Interview With Business Analyst On Electric Vehicles: తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెడ్ ప్రభావం ఈసారి ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. డీజిల్, పెట్రోల్ వాహనాలతో విపరీతంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని చెప్పవచ్చు. ఇంకా బడ్జెట్ ప్రభావంతో జరిగే మార్పులు, ధరల వ్యత్యాసాలపై ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయితో ఏబీపీ దేశం ప్రత్యేక ఇంటర్వూ..
ఏబీపీ దేశం - ఓ వైపు ట్రంప్ ప్రభావం, మరో వైపు పడిపోతున్న రూపాయి ధరలు, ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు భారత్‌కు అంతగా అనుకూలంగా లేని పరిస్దితుల్లో ప్రవేశపెట్టిన ఈ తాజా బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోంది..?
నాగేంద్రసాయి: తాజా బడ్జెట్ మోదీ 3.O రాబోయే నాలుగేళ్ల పాటు కేంద్రం ప్రభుత్వ రోడ్ మ్యాప్‌నకు ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందా, లేదా అనేది మాత్రమే మనం చూడాలి. తాజా బడ్జెట్ అందుకు అనుకూలంగా ఉందనేది అర్దమవుతోంది. ట్రంప్ అధికారంలోకి వస్తారని తెలిసిన నాటి నుంచే రూపాయి ధర పతనమవుతూ వస్తోంది. స్టాక్ మార్కెట్లు వీక్ అవుతున్నాయి. దానికి తోడు ట్రంప్ తీసుకుంటున్న చర్యలు కూడా ఇతర దేశాల ఆర్దిక పరిస్దితులపై ప్రభావం చూపుతున్నాయి. మెక్సికో, చైనా, కెనడా మీద 10 నుంచి 20 శాతం పన్నులు విధించబోతున్నాము. చైనాపై అధికంగా 10 వరకూ పన్నులు విధిస్తామని ట్రంప్ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఆ తరువాత దేశం భారతదేశం ఉందా.?, లేదా.? అనేది కీలకంగా మారింది. చాలా ఉత్పత్తులు మనం ఇండియా నుంచి అమెరికాకు ప్రస్తుతం ఎగుమతి చేస్తున్నాం. ఇప్పుడు పన్నులు అధికంగా విధిస్తే భారత్‌కు కష్టంగా మారుతుంది. రూపాయి విలువ మరింత దిగజారుతుంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే తాజాగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ డీసెంట్ బడ్జెట్‌గా చెప్పవచ్చు. అవుట్ ఆఫ్ 10 మార్కులకు 8 మార్కులు ఈ బడ్జెట్‌కు వేయొచ్చు.
మన దేశ ఆదాయం ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత ఆదాయం, కానీ ఇప్పుడు ఐటీ సెక్టార్ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు సర్వీస్ బేసిడ్ ఆదాయం కూడా పెరిగింది. 30 ఏళ్లుగా సర్వీస్‌పై వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటోంది. ఈసారి బడ్జెట్ ద్వారా వ్యవసాయ ఆధారిత ఆదాయం పెంచేందుకు కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. పీఎం ధాన్య ధార యోజన ద్వారా త్రుణ ధాన్య రైతులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది. ఇతర దేశాల నుంచి పప్పు దినుసుల దిగుమతి తగ్గుతుంది. కిసాన్ క్రెడిట్ రూ.5 లక్షల పరిమితి పెంచడంలో ప్రధాన ఉద్దేశం ఇదే.
ఏబీపీ దేశం - తాజా బడ్జెట్ ప్రభావంతో ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి.?
నాగేంద్రసాయి: లైఫ్ సేవిగ్ డ్రగ్స్‌పై కస్టమ్స్ డ్యూటీ పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో దాదాపు 38 రకాల మందుల ధరలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మందుల ధరలు భారీగా తగ్గుతాయి. కొన్ని రకాల వైద్య పరికరాలు, ఔషధాల ధరలు తగ్గుతాయి. ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (IMPS) విద్యా సంస్దలు వాడుతున్న వీటి ధరలు పెరుగుతాయి. బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి సరుకుపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీని ప్రభావంతో మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై తాజాగా బడ్జెట్ ప్రభావం చూపుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు తగ్గడంతో పాటు అమ్మకాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాయు కాలుష్యం ప్రధాన నగరాల్లో విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం మంచి ఫలితాలిచ్చే అవకాశాలున్నాయి. ఎలక్ట్రిక్ బైక్లు, కార్ల ధరలు దిగిరాబోతున్నాయి. తాజాగా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అంతగా ప్రభావం చూపదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

