Tax Relief: దిగిరానున్న ధరలు, తగ్గనున్న పన్ను మోతలు! - తీపికబురు చెప్పిన నిర్మలమ్మ
GST Tax Burden To Be Reduced: ఆదాయ పన్ను ఉపశమనం తర్వాత, ఇప్పుడు జీఎస్టీ రేట్లు తగ్గుతాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూచించారు. జీఎస్టీ రేట్లు తగ్గితే, ధరలు దిగివచ్చి జనం జేబుపై భారం తగ్గుతుంది.

Nirmala Sitharaman On GST Rate Cut: ఆదాయ పన్ను రేట్లు తగ్గిస్తూ కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఇప్పుడు GST రేట్లపైనా ఓ చల్లటి వార్త చెప్పారు. వస్తువులు & సేవల పన్ను రేట్లు (GST Rates), శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు చివరి దశలో ఉందని & రేట్లను తగ్గిస్తూ త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్' కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చిన నిర్మల సీతారామన్, "జీఎస్టీ రేట్లు & శ్లాబులను హేతుబద్ధీకరించే పని దాదాపు చివరి దశలో ఉంది. 2017 జులై 01న GST ప్రవేశపెట్టిన సమయంలో 15.8 శాతంగా ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు (RNR), 2023 నాటికి 11.4 శాతానికి తగ్గింది. ఇది మరింత తగ్గుతుంది" అని చెప్పారు. సమీప భవిష్యత్‌లో పన్ను ఉపశమనం ఉంటుందని సూచించిన నిర్మలమ్మ, పన్ను సరళీకరణ వల్ల పరిశ్రమలు, వ్యాపారవేత్తలు ప్రయోజనం పొందుతారని అన్నారు. పన్ను రేటు తగ్గితే వస్తువులు కూడా చవకగా మారతాయి, ఇది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. స్టార్టప్‌లు, MSMEలపై పన్ను భారం కూడా చాలా వరకు తగ్గుతుంది.
పని పూర్తి చేసిన GoM
ఆర్థిక మంత్రి నేతృత్వంలోని GST కౌన్సిల్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి & శ్లాబులలో మార్పులు సూచించడానికి 2021 సెప్టెంబర్‌లో మంత్రుల బృందాన్ని (GoM) ఏర్పాటు చేసింది. ఇందులో 6 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉన్నారు. వీరి పని GST శ్లాబులు, రేట్లలో మార్పులను సిఫార్సు చేయడం.
మంత్రుల బృందం అద్భుతంగా పని చేసిందని చెప్పిన ఆర్థిక మంత్రి, ఈ దశలో ప్రతి గ్రూప్ పనిని మరోసారి క్షుణ్ణంగా సమీక్షించడానికి చొరవ తీసుకున్నానని, ఆ తర్వాత దానిని కౌన్సిల్ ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. అక్కడ, ఆ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రేటు కోతలు, హేతుబద్ధీకరణ, స్లాబ్‌ల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవడం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలపై తుది నిర్ణయం తీసుకోవడానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని నిర్మల సీతారామన్ వెల్లడించారు.
12% GST శ్లాబ్ రద్దు కావచ్చు!
వాస్తవానికి, దేశంలో డిమాండ్, వినియోగాన్ని పెంచడానికి భారత ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. దీని కోసం, GST కౌన్సిల్ ఇప్పుడు GST రేట్లను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తోంది. భారత ప్రభుత్వం, 12 శాతం జీఎస్టీ రేటు శ్లాబ్‌ను రద్దు చేయగలదని మార్కెట్ భావిస్తోంది. ఈ స్లాబ్ కిందకు వచ్చే వస్తువులు & సేవలను అవసరమైతే 5% లేదా 18% స్లాబ్‌లోకి మార్చవచ్చు. ఈ కసరత్తు లక్ష్యం GST రేటు నిర్మాణాన్ని హేతుబద్ధీకరిస్తూ, ప్రజా వినియోగాన్ని పెంచడం.
GST శ్లాబ్‌ను మార్చాలని, రేట్లను హేతుబద్ధీకరించాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం జీఎస్టీ కింద నాలుగు శ్లాబ్‌ల పన్నులు ఉన్నాయి. ఆ నాలుగు స్లాబ్‌లు - 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. జీఎస్టీ శ్లాబుల సంఖ్యను 4 నుంచి 3కి తగ్గించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కొన్ని విలాసవంతమైన & హానికారక వస్తువులపై విడిగా సెస్సు విధించే నిబంధన కూడా ఇప్పుడు అమల్లో ఉంది.
రెవెన్యూ న్యూట్రల్ రేటు అంటే ఏమిటి?
రెవెన్యూ న్యూట్రల్ రేటు అంటే పన్ను రేట్లలో మార్పులు చేసినప్పటికీ ప్రభుత్వ ఆదాయంపై ఎటువంటి ప్రభావం చూపని రేటు. ఆదాయ తటస్థ రేటు వద్ద, దేశ ఆర్థిక వ్యవస్థ వేగంపై ఎలాంటి ప్రభావం ఉండదు.
మరో ఆసక్తికర కథనం: పసిడి ప్రియులకు మళ్లీ షాక్, రూ.1100 జంప్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ





















