Garimella Balakrishna Prasad Passes Away: టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత
Garimella Balakrishna Prasad is No more | టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. ప్రముఖ గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ మరణంపై ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు, ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) కన్నుమూశారు. కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ రాజమండ్రిలో జన్మించారు. కానీ తిరుపతి ఆయన స్వస్థలంగా మారిపోయింది. గాయని ఎస్ జానకి మేనల్లుడు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుండి 2006 వరకు ఆస్థాన గాయకుడిగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఉన్నారు. 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు గరిమెళ్ల వారు స్వరకల్పన చేశారు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు స్వరాలను సమకూర్చారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ గరిమెళ్ల ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు.
కర్ణాటక సంగీతంలో గరిమెళ్ల డిప్లొమా చేశారు. ఆల్ ఇండియా రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో పట్టు సాధించారు. కేవలం సంగీతం నేర్చుకోవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ గరిమెళ్ల విశేష కృషి చేశారు. 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరి ఆస్థాన విద్వాంసుడి స్థానం సాధించే వరకూ ఆయన ప్రయాణం సాగింది. 2006లో పదవీ విరమణ పొందారు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకల్పన చేశాడు. టీటీడీ కోసం వేలాది ఆడియో క్యాసెట్ లు పాడారు.

టిటిడి ఆస్థాన విధ్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ భౌతికకాయానికి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నివాళి అర్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన మాట్లాడుతూ.. గరిమెళ్ల కన్నుమూత మనకు తీరని లోటు అన్నారు.























