Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy offers prayers at Medaram Temple | మేడారంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తన కుటుంబసభ్యులతో కలిసి మేడారంలో పూజలు నిర్వహించారు.

ములుగు జిల్లాలోని మేడారంలో నూతనంగా పునర్నిర్మించిన సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని, పలు అభివృద్ధి పనులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (జనవరి 19న) అట్టహాసంగా ప్రారంభించారు. రూ. 251 కోట్లతో మేడారంలో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టగా.. చివరి దశకు పనులు చేరుకున్నాయి.
వనదేవతల గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారం మహాజాతర (జనవరి 28-31) ముంగిట, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకుని, గద్దెలపై నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మనవడితో కలిసి తులాభారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
సాధారణంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానీ, నేతలు, భక్తులు ఎవరైనా మేడారంను దర్శించుకున్న సమయంలో నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడు రేయాన్ష్‌తో కలిసి తులాభారంలో పాల్గొన్నారు. రేవంత్ ఒక్కరే త్రాసులో కూర్చుని తన బరువు అంత బంగారాన్ని సమర్పించడానికి బదులుగా మనవడితో కలిసి తులాభారం వేయడం హాట్ టాపిక్ అవుతోంది.
Hon’ble CM Sri. A. Revanth Reddy inaugurates the pylon and offers worship to tribal deities at Medaram Temple. https://t.co/ZMOwSgNycz
— Revanth Reddy (@revanth_anumula) January 19, 2026
ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు..
రాతి శిల్పకళ: సుమారు రూ. 101 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. 4 వేల టన్నుల గ్రానైట్ రాతిపై ఆదివాసీ సంస్కృతిని ప్రతిబింబించేలా 7 వేల చిత్రాలను చెక్కించారు. కేవలం 100 రోజుల వ్యవధిలోనే ఈ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి భక్తులకు అంకితం చేయడం ఒక రికార్డుగా నిలిచింది.
మౌలిక వసతులు: జంపన్న వాగులో భక్తుల స్నానాలకు వీలుగా పారిశుధ్య పనులు, ఘాట్‌ల అభివృద్ధి, రవాణా సౌకర్యాలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. జంపన్న వాగులో శాశ్వతంగా నీరు ఉండేలా రామప్ప, లక్నవరం చెరువుల నుండి నీటిని మళ్లించే ఏర్పాట్లు చేశారు.
చారిత్రాత్మక మంత్రివర్గ సమావేశం
జనవరి 18 (ఆదివారం) రాత్రి మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్ర చరిత్రలో సచివాలయం వెలుపల ఒక జిల్లాలో క్యాబినెట్ భేటీ నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, మేడారం జాతరను కుంభమేళా తరహాలో నిర్వహించడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.






















