Amaravati Loans: అమరావతి అప్పులు ఏపీ రుణపరిమితిలోకి రావు - చంద్రబాబు సర్కార్‌కు కేంద్రం గుడ్ న్యూస్
Loksabha: అమరావతి నిర్మాణం కోసం చేస్తున్న అప్పుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ అప్పులు ఏపీ రుణ పరిమితిలోకి రావని స్పష్టం చేసింది.

Amaravati: అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నుంచి కేంద్రం ఇప్పిస్తున్న రుణాలు ఏపీకి భారం కాబోవని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆ రుణాలు అసలు ఏపీ రుణ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఒకరు అమరావతికి చేస్తున్న రుణాలు గురించి, ఏపీ ఎఫ్ఆర్‌బీఎం చట్టం పరిమితి గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
అమరావతి అప్పులపై ప్రశ్న అడిగిన వైసీపీ ఎంపీ
అమరావతి నిర్మాణానికి విదేశీ సంస్థల నుంచి తీసుకుంటున్న రుణాలు ఏపీ రుణ పరిధిలోకి రావన్నారు. ఇప్పటి వరకూ అమరావతికి ప్రత్యేక సాయం, గ్రాంట్స్ కింద రెండున్నర వేల కోట్లు ఇచ్చామని.. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ. 6,700 కోట్ల రుణఆమోదానికి సాయం చేశామన్నారు. ఇప్పటికే ప్రపంచబ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు మంజూరయ్యాయన్నారు. అయితే ఇంకా పంపిణీ జరగలేదన్నారు. ప్రస్తుత ప్రాజెక్టులో గరిష్టంగా పది శాతానికి మించకుండా.. పదిహేను వందలకోట్ల ప్రత్యేక సాయంగా కూడా చేయాలని నిర్ణయించామన్నారు. రుణ మంజూరు చేసినప్పుడు ఉన్న రూల్స్ ప్రకారం నిధుల వినియోగంపై పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
అమరావతి సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్
అంటే అమరావతి నిర్మాణానికి మాత్రమే నిధులు వెచ్చించాలని.. ఆ అప్పులు ఏపీ పరిధిలోకి రావని కేంద్రం చెప్పినట్లయింది. అమరావతి పనుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రూ.48 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఆ టెండర్లకు రెండ్రోజుల్లో అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తి చేయనుననారు. ఆ వెంటనే పనులు సైతం ప్రారంభం అవుతాయి. అమరావతి అభివృద్ధి సీఆర్డీయే చూసుకుంటుంది. సీఆర్డీయేనే నిధులు సేకరించి ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా సపోర్టు చేస్తుంది. అమరావతి కోసం ఖర్చు చేసే డబ్బు మళ్లీ అమరావతినే సంపాదించుకుంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఈ నెలలో ప్రారంభం కానున్న నిర్మాణాలు
అమరావతి సెల్ఫ్ సస్టేయినింగ్ ప్రాజెక్ట్. రాజధానిలో పెట్టే ప్రతి రూపాయి మళ్లీ తిరిగి వస్తుంది. సీఆర్డీయేనే రాజధానిని అభివృద్ధి చేస్తుంది. ఆ తర్వాత ప్లాట్లను అమ్మి నిధులు సేకరిస్తుంది. వాటి ద్వారా రాజధాని కోసం తెచ్చిన అప్పులు మెుత్తం చెల్లిస్తుంది. సీఆర్డీయేను అలా డిజైన్ చేశామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అమరావతిలో వివిధ సంస్థలకు భూములు కేటాయించారు. అవి కూడా సమాంతరంగా నిర్మాణాలు చేపట్టనున్నాయి. స్థలాలు కేటాయించిన చోట.. నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాల కేటాయింపులు రద్దు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. టీడీపీ అమరావతి నినాదంతోనే ఎన్నికలకు వెళ్లింది. మూడు ప్రాంతాల్లోనూ కూటమి తిరుగులేని విజయం సాధించడంతో ప్రజంలతా అమరావతికి మద్దతు పలికినట్లయింది. దీంతో అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి సంకోచం లేకుండా ముందుకెళ్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది .






















