Hussain Sagar Fire Accident: హుస్సేన్ సాగర్‌లో అగ్నిప్రమాదం ఘటన - చికిత్స పొందుతూ ఒకరు మృతి- ఇంకా లభించని అజయ్ ఆచూకీ
Hyderabad News | హుస్సేన్ సాగర్‌లో ఆదివారం రాత్రి భారతమాతకు హారతిలో పటాసులు పేలి బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన గణపతి చికిత్స పొందుతూ చనిపోయాడు.
Hyderabad Fire Accident: హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ (Hussian Sagar) లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం ఘటనలో ఒకరు మృతిచెందారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో జరిగిన 'భారత మాతకు మహా హారతి' కార్యక్రమంలో పడవలో బాణసంచా పేలడం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గణపతి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గణపతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని సమాచారం. మరోవైపు రెండు రోజులవుతున్నా ఈ ఘటన తరువాత అదృశ్యమైన అజయ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అసలేం జరిగింది..
భారతమాత ఫౌండేషన్ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి భారతమాతకు హారతి కార్యక్రమం నిర్వహిస్తుండగా హుస్సేన్‌సాగర్‌లో బాణసంచా పేలి రెండు బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో చింతల కృష్ణ, సాయి చంద్, సునీల్, ప్రవీణ్ సహా 8 మందికి కాలిన గాయాలు కాగా, వారిని యశోద, గాంధీ, సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దాదాపుగా అంతా హాస్పిటల్స్ నుంచి డిశ్ఛార్జ్ కాగా, గణపతి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతూ గణపతి మంగళవారం ఉదయం మృతిచెందడంతో విషాదం నెలకొంది.
వైజాగ్ వాసి మణికంఠకు క్రాకర్స్ ఈవెంట్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. గతంలో హైదరాబాద్ కు చెందిన రాఘవేందర్ కు అతడు క్రాకర్స్ సరఫరా చేశాడు. వాటి నగదు ఇవ్వడానికి రాఘవేందర్ తన ఫ్రెండ్స్అజయ్, సాయి సందీప్ ను తీసుకుని ఆదివారం నెక్లెస్ రోడ్డుకు వచ్చాడు. మణికంఠ డబ్బులు ఇచ్చిన అనంతరం వారు మరో పడవలో మణికంఠతో పాటు హుస్సేన్ సాగర్‌లోకి వెళ్లారు. ప్రమాదం సమయంలో మొత్తం రెండు బోట్లలో 15 మంది వరకు ఉన్నారు. ఒక్కసారిగా టపాసులు పేలడం, బోట్లకు మంటలు అంటుకోవడంతో ప్రాణ భయంతో లైఫ్జాకెట్లువేసుకున్న వారు, ఈత వచ్చిన వారు నీళ్లలోకి దూకేశారు. వీరిలో అజయ్అనే యువకుడి ఆచూకీ లభ్యం కావడం లేదు. సోమవారం ఉదయం నుంచి డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, టూరిజం మొత్తం నాలుగు బృందాలు రాత్రి వరకు గాలించినా చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది.
మా కొడుకు ఏమయ్యాడు?
తమ కొడుకు బతికున్నాడా, చనిపోయాడా అంటూ అజయ్ తల్లిదండ్రులు నాగలక్ష్మి, జానకి రామ్ హుస్సేస్ సాగర్ వద్దే సోమవారం మొత్తం కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజీలో అజయ్ ఫైనలియర్ చదువుతున్నాడు. చదువు పూర్తయి తమకు చేదోడు వాదోడుగా నిలుస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. కొడుకు ప్రాణాలతో ఉండి ఉంటాడా అని అందర్నీ అడుగుతున్నారు.