Keslapur Nagaoba Jathara | ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబా జాతరకు సర్వం సిద్ధం | ABP Desam
ఆదిలాబాద్ జిల్లాలో అడవి బిడ్డల సంబురం మొదలైంది. ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా వేడుకలకు ఆదివాసీలు సిద్ధమయ్యారు. అటు అధికారులు నాగోబా జాతర ఏర్పాట్లను పూర్తి చేశారు. పవిత్ర గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు మర్రిచెట్ల వద్ద సాంప్రదాయ పూజలు, ఆచార కార్యక్రమాలు నిర్వహించి కేస్లాపూర్ నాగోబా ఆలయానికి చేరుకున్నారు. మెస్రం వంశ వెంకట్ రావ్ అధ్వర్యంలో మెస్రం వంశీయులు ఉదయం మురాడి దేవాలయం నుండి నాగోబా దేవాలయానికి పురాతన నాగదేవత విగ్రహాలను తరలించారు. డోలు వాయిద్యాల మధ్య సందడిగా అందరూ తెల్లని వస్త్రాలు, తలకు తల పాగాలు ధరించి ఆలయానికి చేరుకున్నారు. నాగోబా ఆలయంలోకి పవిత్ర గంగాజలంతో పాదయాత్రికులు చేరుకున్నారు. మహిళలు సాంప్రదాయ రీతిలో ఆలయ ముఖద్వారం వద్ద అందరూ దర్శించుకుని పెద్దలు సమకూర్చినటువంటి కుండలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరికి ఇలా కుండలను ఇచ్చి ఆ కుండల ద్వారా మహిళలు వరుస క్రమంలో కోనేరు వద్దకు చేరుకొని కోనేరు నుండి నీటిని తీసుకొని ఆలయ సమీపంలో ఉన్న పుట్ట వద్ద నీరు పోసి పుట్టను తయారు చేశారు. అనంతరం డోలు వాయిదాల మధ్య సాంప్రదాయ రీతిలో ఉండలను తయారు చేసి ఆలయ సమీపంలోని సత్తిక్ దేవత వద్ద ఉంచారు. అనంతరం మళ్లీ పుట్టను తయారుచేసి పూజలు నిర్వహించి మర్రి చెట్ల వద్దకు చేరుకున్నారు. మర్రి చెట్ల వద్ద నుండి కుటుంబ సమేతంగా ఎడ్లబండ్లతో సహా అందరూ అక్కడి నుండి ఖాళీ చేసి గోవాడ సమీపంలోకి వచ్చేసారు. గోవాడలో ముందుగా పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు నైవేద్యాలను అక్కడే సమర్పించి సాంప్రదాయ పూజలకు సిద్ధమయ్యారు. నాగోబా అభిషేకం కోసం హస్తలమడుగు నుండి సేకరించిన పవిత్ర గంగాజలాన్ని ఆలయంలో చల్లి శుద్ధి చేశారు. పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేసి అర్ధరాత్రి మహా పూజ ప్రారంభించనున్నారు. మహా పూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాకు బా మహా పూజ కోసం మేస్త్రి వంశీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఇంటిల్లిపాది కుటుంబ సమేతంగా తెలంగాణ ప్రాంతం నుండే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర చత్తీస్గఢ్ జార్ఖండ్ రాష్ట్రాల నుండి తరలివచ్చారు. వారం రోజులపాటు ఇక సందడే కొనసాగనుంది.





















