Rajkot T20 Result: పోరాడి ఓడిన భారత్.. హార్దిక్ పోరాటం వృథా.. ఇంగ్లాండ్ ను గెలిపించిన బౌలర్లు..
ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రాక కష్టమైంది. కీలకదశలో బ్యాటర్లు విఫలమవడం కూడా భారత్ ను దెబ్బ తీసింది. రషీద్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Ind Vs Eng 3rd T20 live Updates: భారత వరుస విజయాలకు అడ్డుకట్ట పడింది. ఐదు టీ20ల సిరీస్ లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. మంగళవారం రాజకోట్ లో జరిగిన మూడో టీ20లో 26 పరుగులతో భారత్ ఓడిపోయింది. తొలుత ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 171/9 చేసింది. ఆ తర్వాత 172 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన భారత్ ఓవర్లన్నీ ఆడి.. 9 వికెట్లకు 145 పరుగులు చేసి ఓడిపోయింది. స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40, 1 ఫోర్, 2 సిక్సర్లు ) చివరి కంటా నిలిచినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు సాధించడం ఇబ్బందిగా మారింది. మరోవైపు కీలకదశలో బ్యాటర్లు విఫలమవడం కూడా భారత్ ను దెబ్బ తీసింది. జామీ ఒవర్టన్ 3 వికెట్లు తీశాడు. బ్రైడెన్ కార్స్, జోఫ్రా ఆర్చర్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆదిల్ రషీద్ (1/15) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. సిరీస్ లో నాలుగో టీ20 ఈనెల 31న పుణేలో జరుగుతుంది. మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
England bounce back with a clinical win in Rajkot to make it 2-1 in the five T20I series👊#INDvENG 📝: https://t.co/rLa32JzewH pic.twitter.com/VeRG5hqNY4
— ICC (@ICC) January 28, 2025
పరుగుల రాక కష్టం..
నిజానికి బ్యాటింగ్ స్వర్గధామమైన రాజకోట్ వికెట్ పై ఛేదన చాలా ఈజీ అవుతుందని అంతా అనుకున్నారు. ఇక మంచు ప్రభావం కూడా దానికి తోడైతే భారత ఇన్నింగ్స్ నల్లేరుపై నడకలాగే అని భావించారు. అయితే భారత ఇన్నింగ్స్ లో ఈ అంచనాలేమీ ఫలించలేదు. నిజానికి రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి ఈ వికెట్ చాలా కష్టమైంది. పిచ్ మందకొడిగా మారడంతో పరుగుల రాక ఇబ్బందిగా మారింది. ఇక శుభారంభమే లభించినా భారత బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఓపెనర్ సంజూ శాంసన్ (3) మరోసారి జోఫ్రా ఆర్చర్ కే చిక్కాడు. పక్కా ప్లాన్ తో వచ్చిన ఆర్చర్ ధాటికి పేలవమైన షాట్ తో సంజూ ఈ సిరీస్ లో వరుసగా మూడోసారి తన బౌలింగ్ లోనే ఔటయ్యాడు. స్కోరు పెంచే క్రమంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (14 బంతుల్లో 24, 5 ఫోర్లు) చిన్న క్యామియో ఆడి ఔటయ్యాడు. దీంతో 31 పరుగులకే ఓపెనర్ల వికెట్లను భారత్ కోల్పోయింది. వన్ డౌన్ వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (14) మరోసారి నిర్లక్ష్యపూరిత షాట్ కు ఔటయ్యాడు. ఒక ఫోర్, సిక్సర్ తో టచ్ లోనే కనిపించిన సూర్య.. వుడ్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గతేడాది తను కెప్టెన్ గా అయినప్పటి నుంచి సూర్య విఫలమవుతూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో నెంబర్లో కాస్త ముందుకొచ్చి మరీ వైఫల్యాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
టర్నింగ్ పాయింట్..
గత మ్యాచ్ లో అజేయ అర్థ సెంచరీతో జట్టును గెలిపించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (18) విఫలం కావడం జట్టు అవకాశాలను దెబ్బ తీసింది. రషీద్ వేసిన బంతి అనూహ్యంగా టర్న్ అయి తిలక్ వికెట్లను గిరాటేసింది. నాలుగు ఇన్నింగ్స్ ల తర్వాత తను ఔట్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. తిలక్ ఔట్ కావడం మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా చివరి కంటా క్రీజులో నిలిచినా, జట్టును గెలిపించలేకపోయాడు. ప్రమోషన్ పొంది బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చిన వాషింగ్టన్ సుందర్ (15 బంతుల్లో6) బంతులను వేస్ట్ చేయడం మినహా ఏమీ సాధించలేకపోయాడు. దీంతో 85 పరుగులకే భారత్ సగం వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత అక్షర్ పటేల్ (15)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గాడిన పడేసేందుకు హార్దిక్ పయత్నించాడు. వీరిద్దరూ స్ట్రైక్ రొటేట్ చేసి, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో ఆరో వికెట్ కు 38 పరుగుల పార్ట్నర్ షిప్ నమోదు చేశారు. టీమిండియాలో ఇదే హైయెస్ట్ భాగస్వామ్యం కావడం విశేషం. అయితే స్కోరు వేగం పెంచే క్రమంలో అక్షర్ ఔటయ్యాడు. ఆ తర్వాత 18వ ఓవర్లో హార్దిక్ ఔటవడంతో జట్టు విజయవకాశాలు అడుగంటాయి. రిక్వైర్డ్ రన్ రేట్ భారీగా పెరిగి పోవడంతో మ్యాచ్ ఇండియా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. చివరికి జురెల్ (2) కూడా విఫలం కావడంతో భారత్ పరాజయం పరిపూర్ణమైంది. ఇంగ్లాండ్ బౌలర్లు ప్రణాళికలకు తగినట్లుగా బౌలింగ్ చేసి.. గత మ్యాచ్ లో చేజారిన విజయాన్ని ఈసారి ఓడిసి పట్టుకున్నారు.




















