Nagoba Jatara: బేతాళ పూజలతో ముగిసిన మెస్రం వంశీయుల ఆచారాలు, ఈ 4వరకు కొనసాగనున్న నాగోబా జాతర
Adilabad News | నాగోబా జాతరలో బేతాల్ పూజలతో మెస్రం వంశీయులు తమ సాంప్రదాయ పూజలు ముగించారు.

Nagoba Jatara 2025: ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరలో మెస్రం వంశీయులు బేతాల్ పూజలతో తమ సాంప్రదాయ పూజలు ముగించారు. పుష్యమాస అమావాస్యను సందర్భంగా జనవరి 28న అర్థరాత్రి మహాపూజతో నాగోబా జాతర (Nagoba Jatara)ను ప్రారంభించిన మెస్రం వంశీయులు శనివారం బేతాల్ పూజలు చేసి సాంప్రదాయ పూజలు పూర్తిచేశారు.
ముందుగా సంప్రదాయ వాయిద్యాల మధ్య గోవాడ ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మెస్రం వంశ మహిళలు మెస్రం వంశ పెద్దల కాళ్లు కడిగి బేతాళ్ పూజలకు ఆహ్వానించారు. మెస్రం వంశీయులతో పాటు మెస్రం వంశ మహిళలు, బేటింగ్ అయిన కొత్త కోడళ్లు ఒకరినొకరు పరిచయం చేసుకుని దండం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ కితకు చెందిన మెస్రం వంశీయులకు మెస్రం వంశీయులతో పాటు మెస్రం వంశ మహిళలు, కొత్త కోడళ్లు కానుకలు అందించారు. మెస్రం వంశ పెద్దలు ఏడు గెనెల వెదురు కర్ర చేత పట్టుకొని బేతాల్ విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం మశీయులు, మెస్రం వంశ మహిళలు, కొత్త కోడళ్లు సాంప్రదాయ నృత్యాలు చేశారు.
బేతాల్ పూజలు ముగించిన మెస్రం వంశీయులు చివరిగా ఒక్కసారి నాగోబాకు మొక్కుకున్నారు. ఓ నాగోబా దేవుడా మహాపూజ నుంచి బేతాళ వరకు నీ పూజలన్నీ కూడా ఘనంగా నిర్వహించాం ఇక సెలవు అంటూ తమ సాంప్రదాయ పూజలను ముగించారు. అనంతరం సతి దేవత, బాన్ దేవత ఆలయంలో కొత్త కోడళ్లు, భక్తులు వేసిన కానుకాలు, ప్యాలాలను 22 కితల వారిగా పంపిణీ చేశారు. ఈ సారి సతిదేవత ఆలయం కానుకలు రూ.78,873 రూపాయలు వచ్చినట్లు నాగోబా ఆలయ పిఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు.
ఈ సందర్భంగా మహాపూజలకు తీసుకోచ్చిన కొత్త కుండలను కితల వారిగా మెస్రం వంశీయులకు పంపిణీ చేశారు. కొత్త కుండలను అందుకున్న మెస్రం వంశీయులకు సంవత్సర కాలం ఆ కుండలకు పూజలు చేయాలని సూచించారు. బేతాల్ విన్యాసాలతో నాగోబా సాంప్రదాయ పూజలను ముగించిన మెస్రం మశీయులు రాత్రి ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ ఆలయానికి బయల్దేరి ఈ నెల 3వ తెల్లవారుజామున బుడుందేవ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంబించనున్నట్లు మేస్రం వంశీయులు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

