YS Viveka Case Witness Deaths | ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ? | ABP Desam
ఆయన ఓ మాజీ ఎంపీ.. అంతే కాదు.. ఓ మాజీ సీఎంకు సోదరుడు.. ఆ జిల్లాలో అతిపెద్ద రాజకీయ కుటుంబానికి ఆయన ముఖ్యనేత. అలాంటి ఆయన తన సొంతింట్లో క్రూరంగా హత్యకు గురయ్యారు. అనుమానితులున్నారు... ఆధారాలున్నాయి. సాక్ష్యాలూ ఉన్నాయి. ఆరేళ్లు అయినా ఆ కేసుకు అతీగతీ లేదు. అంతలోనే ఆ కేసుతో సంబంధం ఉన్న ఒక్కొక్కరూ చనిపోతున్నారు. అందుకే అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. కడప జిల్లాలోని పలుకుబడి కలిగిన నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించే ఇదంతా అని మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.
చాలా కాలంగా రాజకీయ నాయకులు, మీడియా కూడా బాగా మాట్లాడి మాట్లాడి వదిలేసిన ఈ కేసు గురించి మళ్లీ చెప్పుకోవడానికి కారణం.. ఈ కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మరణం. చూడటానికి సహజమరణంలానే కనిపిస్తోంది కానీ ఈ కేసులో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు... కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోవడంతో ప్రతీ విషయాన్ని అనుమానించాల్సి వస్తోంది. ఇప్పటి వరకూ ఇలా ఆరుగురు చనిపోయారు. జనంలో అనుమానాలుండటమే కాదు.. ఇప్పుడు పోలీసుశాఖ కూడా ఈ గొలుసుకట్టు మరణాల తీగను పట్టుకుంది. మరి డొంక కదులుతుందో లేదో చూడాలి.
అసలు ఈ కేసుపై ఎందుకు అనుమానాలంటే.. అప్పట్లో జరిగిన వ్యవహారాలు అలాంటివి మరి. ఆరేళ్ల కిందట వివేకా మర్డర్ జరిగిన దగ్గర నుంచి.. నిన్న రంగయ్య చనిపోయిన వరకూ అనేక మలుపులు తిరిగింది ఈ కేసు. ఈ హత్యలో ఉన్న కోణాలే కాదు.. ఆరేళ్ల కిందట రాష్ట్ర రాజకీయ రంగాన్నే మలుపతిప్పింది కూడా. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ అడుగులోనూ ఒక్కో ట్విస్ట్ ఉంది. వరుసగా ఏం జరుగుతూ వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం.
2019, మార్చ్ 15 తెల్లవారుజామున రక్తపుమడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చి రాత్రి ఇంట్లో పడుకున్న ఆయన్ను లేపేందుకు ఆయన పీఏ కృష్ణారెడ్డి తెల్లవారుజామున ఇంటికి వెళ్లారు. ఎంతకూ నిద్రలేవకపోవడంతో వెనుక నుంచి తలుపులు తెరిచి వివేకా రక్తపు మడుగులో పడిపోయినట్లు గుర్తించారు.





















