Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
న్యూఇయర్ వేడుకల సందర్భంగా సముద్రతీరంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న క్షణాల్లోనే ఊహించని దారుణం జరిగింది. కాకినాడకు చెందిన కృష్ణ దాస్ తన ఇద్దరు స్నేహితులు నిమ్మకాయల శ్రీధర్, బొండాడ సూర్య కిరణ్‌లతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు బుధవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్దకు వచ్చారు. అక్కడ రాత్రి వేళ సెలబ్రేషన్స్ చేసుకుంటూ.. శ్రీధర్ మరో స్నేహితుడితో కలిసి బీచ్‌లో థార్ కారులో డ్రైవ్ చేయడం మొదలుపెట్టారు. అయితే అన్నాచెల్లెళ్ల గట్టు దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న ప్రమాదకరమైన మలుపును గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. కారు సముద్రంలోకి దూసుకుపోతోందని గమనించిన శ్రీధర్ స్నేహితుడు కారులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా శ్రీధర్ మాత్రం కారుతో సహా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. విషయం తెలియగానే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కి ఆటంకం కలిగినా.. అతి కష్టం మీద కారును బయటకు తీశారు. ఈ ఘటనలో కారులో ఉన్న శ్రీధర్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే.. బీచ్ ప్రాంతాల్లో వాహనాలు నడపొద్దంటూ ఎన్ని సార్లు హెచ్చరించినా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేసి యువత ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారని అధికారులన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పోకడలు మానుకోవాలని సూచించారు.





















