Srimukha lingam Chakra teertham | భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానం | ABP Desam
వేల మంది భక్తులు పంటపొలాల్లో నుంచి మోసుకువస్తున్న శ్రీముఖలింగేశ్వరుడిని చూశారా...ఇక్కడ చూడండి...వంశధార నదిలోకి వేలాది భక్తుల మధ్య స్వామి వారికి జరుగుతున్న చక్ర తీర్థ స్నానం. చూడటానికి కన్నుల పండువగా ఉంది కదా. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగ క్షేత్రంలోని శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నాన మహోత్సవం ఇది. వంశధార నదీ తీరంలో వెలసిన ఆ మధుకేశ్వరుని సన్నిధిలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరిగాయి. వేలాది ఏళ్ల నాటి సంప్రదాయాన్ని పునస్కరించుకుని, అత్యంత వైభవంగా జరిగిన 'చక్రతీర్థ స్నానం' కోసం భక్తులు ఇదిగో ఇలా వేలాదిగా తరలివచ్చారు. వారందరి ఆనందోత్సాహాల మధ్య శ్రీముఖలింగేశ్వరుడిని ఆలయం నుంచి వెలుపలకి తీసుకువచ్చి ఊరేగింపుగా పంటపొలాల మీదుగా వంశధార నదిలోకి తీసుకువెళ్లి చక్నస్నాన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్త జన సందోహం మధ్య శ్రీముఖలింగేశ్వరుడికి చక్రస్నానాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అనే స్థాయిలో స్వామి వారి వేడుకలు వంశధార నదిలో అత్యంత వైభవం గా జరిగింది.























