Model School Exam Date: 'మోడల్ స్కూల్' దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, ప్రవేశ పరీక్ష వాయిదా - ఎగ్జామ్ ఎప్పుడంటే?
TGMS: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు పరీక్ష తేదీని ఏప్రిల్ 20కి మార్చారు.

Model School Application Date Extended: తెలంగాణలోని ఆదర్శపాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 13న నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష వాయిదాపడింది. పరీక్షను ఏప్రిల్ 20కి వాయిదావేసినట్లు మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి మార్చి 8న ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ప్రవేశపరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10తో ముగియనుండగ.. మార్చి 20 వరకు పొడిగించినట్ల ఆయన తెలిపారు. ప్రవేశపరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 15న విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 20న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశాలకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతిలోని ఖాళీల భర్తీకి ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు శ్రీనివాసచారి తెలిపారు. మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కోసం ఇప్పటి వరకు 33,892 మంది దరఖాస్తులు అందాయని ఆయన వెల్లడించారు.
తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష-2025 దరఖాస్తు గడువును విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఒకసారి పొడిగించారు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 6న ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును మార్చి 10 వరకు పొడిగించారు. అయితే విద్యార్థుల సౌలభ్యం మరో పదిరోజులు అంటే మార్చి 20 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ 194 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో 100 సీట్లలో (మొత్తంగా 19,400 సీట్లు) ప్రవేశాలు కల్పించనున్నారు. అలాగే 7-10 తరగతుల్లోని మిగిలిన ఖాళీలను సీట్లను భర్తీ చేస్తారు. ప్రతి తరగతికి రెండు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో 50 చొప్పున విద్యార్థులు ఉంటారు.
* మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2025
ప్రవేశాలు కల్పించే తరగతులు: 6, 7, 8, 9, 10.
వయోపరిమితి: 6వ తరగతికి-10 సంవత్సరాలు, 7వ తరగతికి-11 సంవత్సరాలు, 8వ తరగతికి-12 సంవత్సరాలు, 9వ తరగతికి-13 సంవత్సరాలు, 10వ తరగతికి-14 సంవత్సరాలు నిండిపోయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, టీపీటీ, సీఎస్ తదితర పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 ప్రశ్నలకుగాను 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయించారు. 6వ తరగతికి (తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్&సోషల్(ఈవీఎస్), ఇంగ్లిష్) నుంచి మిగతా తరగతులవారికి (ఇంగ్లిష్,మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2 గంటలు.

ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 23.12.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.01.2025.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరితేది: 28.02.2025. (10.03.2025 వరకు పొడిగించారు)
➥ పరీక్ష తేదీ: 13.04.2025.
పరీక్ష సమయం:
➥ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 6వ తరగతికి,
➥ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నుంచి 10వ తరగతికి పరీక్షలు నిర్వహిస్తారు.





















