Naga Babu Net worth: చిరంజీవి, పవన్ కల్యాణ్ నుంచి నాగబాబు అప్పులు - ఆయనకు ఉన్న మొత్తం ఆస్తులు ఎన్నో తెలుసా?
Naga Babu files nomination for MLC election: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా.. తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు.

Naga Babu's Net Worth Assets Declared In MLC Election Affidavit: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన తరఫున కొణిదెల నాగబాబు (Nagababu) నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు. తన అన్న చిరంజీవి నుంచి రూ.28,48,871, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ.6.90 లక్షల అప్పులు తీసుకున్నట్లు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఆయన స్థిర, చరాస్తులు, రుణాల వివరాలను పరిశీలిస్తే..
స్థిరాస్తులు..
- రంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల ఉన్న 2.39 ఎకరాల భూమి విలువ రూ.3.55 కోట్లు. అలాగే, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ.32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు, అదే ప్రాంతంలో మరో సర్వే నెంబరులో ఉన్న 5 ఎకరాలు విలువ రూ.50 లక్షలు. రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో రూ.53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూములు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
- హైదరాబాద్ మణికొండలో రూ.2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా.. మొత్తంగా రూ.11.20 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
Also Read: ట్రాన్స్‌జెండర్‌గా నాని... 'ది ప్యారడైజ్'తో నాచురల్ స్టార్ డేరింగ్ అటెంప్ట్ చేస్తున్నాడా?
చరాస్తులు చూస్తే..
- చేతిలో నగదు - రూ.21.81 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు - రూ.55.37 కోట్లు, బ్యాంక్ బ్యాలెన్స్ - రూ.23.53 లక్షలు
- ఇతరులకు ఇచ్చిన అప్పులు - రూ.1.03 కోట్లు, బెంజ్ కారు రూ.67.28 లక్షలు, హ్యుందయ్ కారు రూ.11.04 లక్షలు
- తన వద్ద రూ.18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం, తన భార్య వద్ద రూ.16.50 లక్షల విలువైన 55 క్యారట్ల వజ్రాలు, రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ.21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నట్లు వెల్లడించారు. తనకు, తన భార్యకు కలిపి మొత్తం మొత్తం రూ.59.12 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అప్పులు..
- రెండు బ్యాంకుల్లో గృహ రుణం మొత్తం రూ.56.97 లక్షలు, కారు రుణం రూ.7,54,895. ఇతర వ్యక్తులు, సంస్థల నుంచి తీసుకున్నవన్నీ కలిపి రూ.1.64 కోట్ల అప్పులున్నట్లు నాగబాబు తెలిపారు. తన అన్న చిరంజీవి నుంచి రూ.28,48,871, తమ్ముడు పవన్ నుంచి రూ.6.90 లక్షలు అప్పు తీసుకున్నట్లు చెప్పారు.
కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన తరఫున నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజులు ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ కాబోతోన్న 5 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూటమి తొలి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు. ఇక మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ నుంచి పలువురు నేతలు ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికలకు ముందు టికెట్ దక్కని నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇవ్వగా.. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్‌ను కలిసి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.





















