Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్‌కు ట్రీట్మెంట్.. పక్కటెముకలకు తీవ్ర గాయంపై ఫ్యాన్స్ ఆందోళన
Shreyas Iyer Health Condition | ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయమైన శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పడుతూ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయ్యర్ పక్కటెముకలకు గాయం కావడంతో మైదానంలోనే బాధతో విలవిల్లాడిపోయాడు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, భారత వైస్ కెప్టెన్ అయ్యర్‌కు తీవ్ర గాయాలతో సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్నాడు. అయ్యర్‌కు అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఒక వ్యక్తి PTIతో మాట్లాడుతూ.. మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ అయ్యర్ గాయపడ్డాడు. పక్కటెముకలకు గాయం కావడంతో ఫిజియోతో పాటు మైదానం నుంచి డ్రెస్సింగ్ రూముకు వెళ్లాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో సిడ్నీలోని హాస్పిటల్ లో చేర్పించారు. కానీ అంతర్గతంగా బ్లీడింగ్ అవుతుందని ఐసీయూలో షిఫ్ట్ చేసి అయ్యర్‌కు ట్రీట్మెంట్ చేస్తున్నారని ఆ వ్యక్తి తెలిపారు.
ఇన్‌ఫెక్షన్ సోకకుండా వైద్యుల ప్రయత్నాలు..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అలెక్స్ కేరీ ఆడిన బాల్ క్యాచ్ పట్టేందుకు వెనక్కి వెళ్లాడు శ్రేయస్ అయ్యర్. ఈ క్రమంలో బంతిని గట్టిగా పట్టుకునే క్రమంలో పడిపోయిన శ్రేయస్ అయ్యర్ పక్కటెముకలకు గాయమైంది. నొప్పితో మైదానంలో ఇబ్బంది పడ్డాడు. తరువాత టెస్టులు చేయగా శ్రేయస్ అయ్యర్‌కు అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) కారణంగా ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది అని ఒకకు పీటీఐకి తెలిపారు. రక్తస్రావం వల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి చికిత్స అందిస్తున్నారు. రెండు నుంచి 7 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిన అయ్యర్
శ్రేయస్ అయ్యర్ మొదట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అలెక్స్ క్యారీ కొట్టిన బంతి గాలిలో ఉండగ అయ్యర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ వద్ద ఉన్నాడు. వెనక్కి పరుగెత్తి, డైవ్ చేసి ఆ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఈ ప్రక్రియలో ఆయన పక్కటెముకలకు గాయమైంది. డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్తున్నప్పుడు, అయ్యర్ శరీర ఉష్ణోగ్రత, పల్స్ రేట్, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ లో లేవని సమాచారం. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది స్పష్టంగా కనిపించింది. దీంతో బీసీసీఐ మెడికల్ టీమ్ అయ్యర్‌ను సిడ్నీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించింది.
అంతర్గత రక్తస్రావం కారణంగా అయ్యర్ కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని మెడికల్ నిపుణులు భావిస్తున్నారు. అయ్యర్ కోలుకుని మళ్లీ ఎప్పుడు బ్యాట్ పడతాడనేది ఇప్పడే చెప్పలేని పరిస్థితి ఉంది. మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి, కోలుకున్నాక అయ్యర్ డిశ్చార్జ్ కానున్నాడు. తరువాతే భారతదేశానికి తిరిగిరానున్నాడు. మరోవైపు టీమిండియా అక్టోబర్ 29 నుండి ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ టీ20 సిరీస్ ఆడే జట్టులో అయ్యర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని తెలిసిందే.





















