AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై తుది నివేదిక రెడీ
Andhra Pradesh News | రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంత్రిరవ్గ ఉపసంఘం నివేదిక సిద్ధం చేసింది. మంగళవారం నాడు సీఎం చంద్రబాబుతో సమావేశమై దీనిపై చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు: తుది నివేదికకు సిద్ధం
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై ప్రభుత్వం చేపట్టిన కసరత్తు చివరి దశకు వచ్చింది. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో సమావేశం కానుంది. ఈ కీలక భేటీలో జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు, పేర్ల మార్పుపై రాష్ట్రవ్యాప్తంగా అందిన అర్జీలు, వినతులపై చర్చిస్తారు. సీఎం చంద్రబాబు సూచనలు తీసుకుని మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదికను రూపొందించనుంది.
కొత్త జిల్లాలు, మండలాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించిన ఈ నివేదికను నవంబరు 7వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, చివరగా గెజిట్‌ను విడుదల చేస్తారు. జనగణన ప్రక్రియ ఉన్న కారణంగ ఈ మొత్తం ప్రక్రియను డిసెంబరు 31వ తేదీ లోగానే పూర్తిచేయాలని కూటమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు, క్షేత్ర స్థాయి పరిశీలన
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆగస్టు 13న తొలి సమావేశం నిర్వహించి, అనంతరం జిల్లాల వారీగా ప్రజలు, వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించింది. ఇటీవల జరిగిన భేటీలో అందిన అన్ని అర్జీలపై చర్చించి, జిల్లాల అధికారుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మేరకు రంపచోడవరం, చింతూరు డివిజన్లతోపాటు 4 విలీన మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 187 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది.
అమరావతి, మదనపల్లె జిల్లాల ప్రతిపాదన..
అలాగే, అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. సచివాలయం, అసెంబ్లీ, కొత్త భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల నిర్వహణ, ప్రొటోకాల్ విధుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. వీటితో పాటు మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాల నివేదికను కూడా సమర్పించనున్నారు.
ప్రకాశం జిల్లా సరిహద్దు వివాదం
మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అందులో భాగంగా మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు ఉపసంఘం సిఫార్సు చేసింది. అద్దంకి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలనే ప్రతిపాదన ఉంది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేస్తున్నారు కనుక కందుకూరును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా? లేక ప్రకాశం జిల్లాలో చేర్చాలా? అనే అంశంపై రేపు సమావేశంలో డిసైడ్ చేయనున్నారు.
రెవెన్యూ డివిజన్ల మార్పులు
కొత్తగా అద్దంకి, మడకశిర సహా సుమారు 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిపాలనా సౌలభ్యం మేరకు, ఒక నియోజకవర్గం రెండు, 3 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉంటే ఒకే నియోజకవర్గ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదోని మండలంలో జనాభా ఎక్కువగా ఉన్నందున, ఈ మండలాన్ని విభజించాలని ప్రజల వినతులపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మండపేట, కొత్తపేట, ఎస్.కోట సహా కొన్ని నియోజకవర్గాలను మరో జిల్లాకు మార్చాలనే ప్రతిపాదనలు ఉపసంఘం సీఎం దృష్టికి తీసుకెళ్లనుంది.






















