Mustafizur Rahman Joins PSL: ఐపీఎల్ నుండి తొలగింపు.. PSLలో ఆడాలని ముస్తాఫిజుర్ రెహ్మాన్ నిర్ణయం.. 3 రోజుల్లో మారిన సీన్
IPL 2026 నుండి తప్పించిన తరువాత బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పాక్ నిర్వహించే PSL లో ఆడేందుకు వెళ్తున్నాడు. ఐపీఎల్ డీల్ కోల్పోయి తక్కువ ధరకు ఆడనున్నాడు.

IPL 2026 నుండి తొలగించిన రెండు రోజులకే బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) వైపు మొగ్గు చూపాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయడం వివాదాలకు కేంద్రమైంది. భారత్ వద్దను పంపించిన కొన్ని రోజుల్లోనే అతడు పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో ఆడాలని నిర్ణయం తీసుకున్నాడు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా అని చర్చ జరుగుతోంది. కొన్ని వారాల క్రితం జరిగిన IPL 2026 మినీ వేలంలో రూ. 9.20 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాడు. కోట్ల రూపాయలకు కేకేఆర్ అతడ్ని తీసుకుంది. కానీ బంగ్లాదేశ్ లో హిందూవుల వరుస హత్యలతో కేంద్రం సూచనతో బీసీసీఐ ముస్తాఫిజుర్ ను రిలీజ్ చేయాలని కేకేఆర్ కు సూచించింది. కేకేఆర్ అదే పని చేసింది. అదే బౌలర్ తాజాగా PSLలో తక్కువ ధరకు ఆడుతున్నాడు.
IPL నుండి ఔట్.. అంతలోనే మారిన సీన్
IPL 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను KKR రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత, బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసకు సంబంధించిన కారణాలతో భారతదేశంలో అతనిపై నిరసనలు ప్రారంభమయ్యాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, BCCI కీలక నిర్ణయం తీసుకుంది. దీని కారణంగా షారుఖ్ ఖాన్ జట్టు KKR ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను తమ స్క్వాడ్ నుండి తొలగించింది.
PSLలో 8 ఏళ్ల తర్వాత పునరాగమనం
IPL నుండి తొలగించిన తర్వాత ముస్తాఫిజుర్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో చేరాడు. PSL అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పేసర్ చేరికను ప్రకటించారు. ముస్తాఫిజుర్ ఎనిమిదేళ్ల తర్వాత PSLలో తిరిగి ఆడుతున్నాడు. అతను గతంలో లాహోర్ ఖలందర్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. PSL డ్రాఫ్ట్ జనవరి 21న జరగనుండగా లీగ్ మార్చి 23న ప్రారంభమవుతుంది. ఇది IPL ప్రారంభానికి కేవలం 3 రోజుల ముందు ప్రారంభమవుతుంది.
ఐపీఎల్ తో పోల్చితే చాలా తక్కువ..
IPL తో పోల్చితే PSL లీగ్ ఆడేవారికి తక్కువ నగదు వస్తుంది. ముస్తాఫిజుర్‌కు IPLలో రూ. 9.20 కోట్లు వచ్చేవి. PSLలో చాలా తక్కువ మొత్తం లభించనుంది. PSL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు డేవిడ్ వార్నర్, అతడికి దాదాపు రూ. 2.70 కోట్లు మాత్రమే వచ్చాయి. ముస్తాఫిజుర్ ఇప్పుడు "నామమాత్రపు ధర"కు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు.
అంతర్జాతీయ, రాజకీయ స్థాయికి చేరిన విషయం
ముస్తాఫిజుర్ IPL నుండి నిష్క్రమించిన తర్వాత, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కఠినమైన వైఖరిని అవలంబించింది. ICCకి బీసీబీ లేఖ రాస్తూ, T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్‌లన్నీ భారతదేశం నుంచి శ్రీలంకకు తరలించాలని కోరగా అందుకు ఐసీసీ నిరాకరించినట్లు సమాచారం. భద్రతా కారణాలను సాకుగా చెబుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం IPL మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నిషేధించం తెలిసిందే. భారత్ లో ఆడేందుకు రావడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరిస్తోంది. ఒకవేళ అలా రాని పక్షంలో నష్టపోయేది బంగ్లా జట్టు మాత్రమే.




















