Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
India Fighter Jets: భారతదేశంలో 114 రాఫెల్ యుద్ధ విమానాలు తయారుకానున్నాయి. ఇక్కడ తయారు చేస్తే భారత్ రాఫెల్ ఫైటర్ జెట్స్‌ను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంది.

Rafale Jets Made in India: భారత్ మరోసారి ఫ్రాన్స్‌తో రక్షణ ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత వైమానిక దళం కోసం 114 రాఫెల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీకి ఆమోదం తెలిపింది. దాదాపు రూ. 3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ ఒప్పందాలలో ఒకటిగా నిలవనుంది. ఈ క్రమంలో రాఫెల్ ఫైటర్ జెట్‌లు భారతదేశంలో తయారైతే, వాటిని ఇతర దేశాలకు విక్రయించవచ్చా లేదా అనే దాని గురించి ఇక్కడ వివరాలు తెలుసుకుందాం.
రాఫెల్ కోసం భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్
తాజా నివేదికల ప్రకారం, ఫ్రాన్స్‌లోని డసాల్ట్ ఏవియేషన్ తర్వాత రాఫెల్ ఫైటర్ జెట్‌ల కోసం భారత్‌ను రెండవ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని భావిస్తోంది. అంటే, భారతదేశంలో తయారు చేసే ఫైటర్ జెట్స్ భారత వైమానిక దళం అవసరాలకు మాత్రమే పరిమితం కావు. ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలను అంతర్జాతీయ ఎగుమతి ఆర్డర్‌లను పూర్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.
నాగ్‌పూర్ ఫైనల్ అసెంబ్లీ లైన్, ఉత్పత్తి సామర్థ్యం
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని MIHAN ప్రత్యేక ఆర్థిక జోన్ (SEZ)లో ప్రత్యేక రాఫెల్ ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయనుంది. ఈ సౌకర్యం సంవత్సరానికి 24 ఫైటర్ జెట్‌లను తయారు చేస్తుందని ప్రస్తుతానికి భావిస్తున్నారు.
MRO సేవల ద్వారా ఎగుమతి
పూర్తి యుద్ధ విమానాల ఎగుమతిలో నియంత్రణ లేదా దౌత్యపరమైన అడ్డంకులు ఎదురైనా భారతదేశం నిర్వహణ, మరమ్మత్తు, ఓవరాల్ ఎగుమతుల ద్వారా ప్రయోజనం పొందనుంది. రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉపయోగించే దేశాలకు భారతదేశం ప్రాంతీయ MRO హబ్‌గా అభివృద్ధి కానుంది.
స్వదేశీ ఆయుధాలు.. ఇండియన్ రాఫెల్ ప్రత్యేకం
భారతదేశంలో రాఫెల్ ఫైటర్ జెట్‌లను తయారు చేయడంలో అతిపెద్ద ప్రయోజనం స్వదేశీ ఆయుధాలు, మన వ్యవస్థలను అనుసంధానం చేయడం. భారతదేశంలో తయారు చేసిన రాఫెల్‌లో భారత క్షిపణులు, అంటే ఎక్స్‌ట్రా బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వంటివి అమర్చుతారు. ఇది ఒక ప్రత్యేకమైన ఇండియన్ రాఫెల్ వేరియంట్‌ను సృష్టిస్తుంది. రాఫెల్ ఫైటర్ జెట్ ప్రధాన మేధో సంపత్తి హక్కులు ఫ్రాన్స్ వద్దే ఉంటాయని మీకు తెలుసా. మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్‌వర్క్ కింద భారత రాఫెల్ ప్రోగ్రామ్‌లో దాదాపు 60% స్వదేశీకరణను ఆశిస్తున్నారు. ఈ చర్య తరువాత, రాఫెల్ తయారీ భారతదేశాన్ని ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎగుమతి చేసే దేశాల ఎలైట్ క్లబ్‌లో చేర్చుతుందని కేంద్రం ప్లాన్ చేసింది. ఇది భారతదేశ రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది, వేలాది మందికి ఉపాధిని కూడా అందిస్తుంది.






















