Reels Impact Brain: రీల్స్‌తో మెదడు గింగరాగిరే! బ్రెయిన్ రాట్ ముప్పుపై శాస్త్రవేత్తల హెచ్చరిక
Short-form Content Impact: సోషల్ మీడియాలో వచ్చే షార్ట్ ఫామ్ కంటెంట్ మీ మెదడును తీనేస్తోంది. మీకు తెలియకుండానే అసహనం, ఫోకస్ మీస్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

Brain Rot with Short form Content:నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం మన వేళ్ల చివరన ఉంటోంది. కానీ ఆ సమాచారం మన మెదడును విజ్ఞాన ఖనిగా మార్చాల్సింది పోయి శూన్యంలోకి నెట్టేస్తోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం సామాజిక మార్పులకు పరిమితం కావడం లేదు. అది నేరుగా మెదుడు ఆరోగ్యంపై దాడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్ వంటి షార్ట్ ఫామ్ వీడియోలు మన ఆలోచనా సరళిని మార్చేస్తున్న తీరు ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు గొంతెత్తుతున్నారు. దీనికి బ్రెయిల్ రాట్ పేరుతో పరిశోధనలు చేస్తూ ఆర్టికల్స్ రాస్తున్నారు.
ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా వినియోగదారులు సరదాగా వాడుకునే బ్రెయిన్ రాట్ అనే పదం ఇప్పుడు అధికారిక ముద్ర వేసుకుంది. ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ 2024 వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. అంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తక్కువ నాణ్యత కలిగిన ఆన్‌లైన్ కంటెంట్‌ను గంటల తరబడి చూడటం వల్ల వ్యక్తి బుద్ధి స్థాయి, ఆలోచనా శక్తి క్షీణించడాన్ని బ్రెయిన్ రాట్ సూచిస్తుంది. ఇది కేవలం మాటలకు పరిమితం కాలేదు. ఇది మెదడు కణాల క్షీణతకు దారి తీసే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
షార్ట్ వీడియోలతో బ్రెయిన్‌కు ముప్పు
మనోవైజ్ఞానికి నిపుణుల విశ్లేషణ ప్రకారం... షార్ట్ వీడియోల నిరంతర వీక్షణ మెదడు సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా గత సెప్టెంబర్‌లో వెల్లడైన ఒక అధ్యయనం ప్రకారం ఇలాంటి వీడియోలు మెదడులోని భావోద్వేగ నియంత్రణ వ్యవస్థను బలహీనపరుస్తున్నాయియ. అక్టోబర్ 2025లో మిన్నెపోలిస్‌లోని కాపెల్లా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన 1 విభిన్న అధ్యయనాల సమీక్షలో టిక్‌టాక్ బ్రెయిన్ అనే వింత పరిస్థితి వెలుగులోకి వచ్చింది.
15 నుంచి 60సెకన్ల మధ్య ఉండే వీడియోలను నిరంతరం చూడటం వల్ల మెదడు కేవలం తక్కువ కాలం మాత్రమే ఏదైనా విషయంపై దృష్టి పెట్టగలుగుతుంది. దీని వల్ల పిల్లలలో, పెద్దలలో అటెన్షన్ స్పాన్ ఘోరంగా పడిపోతోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రచురించిన రివ్యూ ప్రకారం ఈ డిజిటల్ అలవాటు డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు కారణం అవుతోంది.
తరగతి గదుల్లో కనిపిస్తున్న ప్రభావం
ఈ సంక్షోభం కేవలం పరిశోధనాశాలలకే పరిమితం కాలేదు. నేరుగా మన విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నుంచి అందుతున్న ఫిర్యాదుల ప్రకారం టీనేజర్లు క్లాస్‌లో ఏకాగ్రత చూపడం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీర్ఘకాలికంగా చేసే పనులపై వారు శ్రద్ధ చూపలేకపోతున్నారు.
పరిశోధకుడు కీత్ రాబర్ట్ హెడ్ లేవనెత్తిన ఒక ప్రశ్న ఇప్పుడు అందర్నీ ఆలోచింపజేస్తోంది. పిల్లల్లో పెరుగుతున్న AHD కేసులు నిజమైనవేనా లేకా షార్ట్ వీడియోల అతి వినియోగం వల్ల వచ్చిన దుష్ప్రభావాలా అనేది తేలాల్సి ఉంది. నిరంతరం డిజిటల్ ఉద్దీపన వల్ల ప్రవర్తనలో మార్పులు రావడం ఒక ప్రమాద సంకేతం.
అతి వ్యాప్తి ఆందోళనలా?
అయితే ఆందోళన అంతా ఓవర్ రియాక్షన్ అని కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. వాండర్ బిల్డ్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైకాలజిస్ట్ జేమ్స్ జాక్సన్ ప్రకారం, షఆర్ట్ వీడియోలు అన్నీ చెడ్డవి కావు. అవి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, సామాజిక బంధాలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరైనా ఆరోగ్యకరమైన ఇతర అవకాశాలను కోల్పోతూ, సామాజికంగా ఒంటరి అవుతున్నప్పుడు మాత్రమే అది సమస్యగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు పీడియాట్రిక్ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ నిధి గుప్తా ప్రకారం పెద్దలు టెక్నాలజీతో తక్కువ పరిచయం కలిగి ఉండటం వల్ల వారు ఈ బ్రెయిన్ రాట్‌కు మరింత హానికరంగా మారే అవకాశం ఉంది. ఆమె ఆల్కాహాల్, డ్రగ్స్ వ్యసనంతో దీనిని పోలుస్తూ, దీని ప్రభావం పూర్తిగా తెలియడానికి కనీసం ఐదు నుంచి పదేళ్ల సుదీర్ఘ పరిశోధన అవసరం అని అభిప్రాయపడ్డారు.
పరిష్కారం ఎక్కడ ఉంది
ఈ డిజిటల్ ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే సమతుల్యత అత్యంత ముఖ్యం.
స్వయం పర్యవేక్షణ : సోషల్ మీడియాలో గడుపుతున్న సమయాన్ని గమనించుకోవాలి.
ఆరోగ్యకర అలవాట్లు: కేవలం స్క్రోలింగ్‌కే పరిమితం కాకుండా సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనాలి.
పిల్లలపై నిఘా: అభివృద్ధి చెందుతున్న మెదడుపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పిల్లల స్క్రీన్ టైమ్‌ను నియంత్రించాలి.
షార్ట్ ఫామ్ వీడియోలు ఆధునిక జీవిశైలిలో ఒక భాగంగా మారిపోతున్నాయి. అందుకే అవి మెదడు శాసించే స్థాయికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు.





















